
నత్తనడక
- విద్యార్థుల ఆధార్ నమోదులో జాప్యం
- ఆరు నెలలుగా కొనసాగుతున్న వైనం
- డిసెంబర్15 నాటికే పూర్తికావాల్సిన ప్రక్రియ
- ప్రధానోపాధ్యాయులు సహకరించడం లేదంటున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు
- విద్యార్థుల సంఖ్యలో తేడాలుండడమూ కారణమే!
పాఠశాల విద్యలో పారదర్శకత కోసం తలపెట్టిన 'విద్యార్థి సమాచార నమోదు' జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పాఠ్య పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, ఉపకారవేతనాలు, యూనిఫాం తదితర కార్యక్రమాల్లో డూప్లికేషన్‌కు తావులేకుండా ప్రతి విద్యార్థి వివరాల్ని ఆన్‌లైన్లో నమోదుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రత్యేకంగా రూపొందించిన వైబ్‌సైట్లో విద్యార్థి పూర్తి సమాచారంతోపాటు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా ఎంట్రీ చేయాలి. దీంతో పథకాల అమలులో అక్రమాలకు ఆస్కారం లేకుండా ఉంటుందనేది ప్రభుత్వ ఉద్దేశం. కానీ జిల్లాలో ఈ ప్రక్రియ ఆర్నెల్లుగా కొనసాగుతూనే ఉంది.
రంగారెడ్డి జిల్లా:
రాష్ట్రంలోనే అత్యధిక పాఠశాలలున్నది జిల్లాలోనే. విద్యాశాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కలిపి 5,135 ఉన్నాయి. వీటిలో 2,829 ప్రాథమిక, 791 ప్రాథమికోన్నత, 1,515 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో 11.01 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు జిల్లా పాఠశాల విద్యా సమాచార (యూడైస్ 15-16) లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నమోదు ప్రక్రియకు ఉపక్రమించిన విద్యాశాఖ అధికారులు.. ఇప్పటివరకు కేవలం 7.35 లక్షలు మాత్రమే పూర్తిచేశారు. నిర్దేశిత సంఖ్యలో కేవలం 66.75 శాతం విద్యార్థుల వివరాలు మాత్రమే నమోదయ్యాయి.
సర్కారు బడులదే ఆలస్యం..
జిల్లాలో 5,135 పాఠశాలల్లో ప్రభుత్వ బడులు 2,369 ఉన్నాయి. వీటిలో 3.75 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తలపెట్టి ఆన్‌లైన్ నమోదు ప్రక్రియలో ప్రభుత్వ విద్యార్థులే వెనుకబడ్డారు. నమోదు ప్రక్రియ బాధ్యతల్ని విద్యాశాఖ మండల విద్యాధికారులకు అప్పగించింది. ఈ బాధ్యతల్ని క్షేత్రస్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లకు అప్పగించడం.. వారికి అవగాహన లేకపోవడంతో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. డిసెంబర్ 15 నాటికే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 66.75శాతమే పూర్తవడం గమనార్హం.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో సహకరించడంలేదని ఎంఐఎస్ కోఆర్డినేటర్లు పేర్కొంటున్నారు. విద్యార్థుల సంఖ్యలో తేడాలుండడంతోనే వివరాల నమోదుకు సంకోచిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
విద్యార్థి వివరాల్లో ఆధార్ సంఖ్య తప్పనిసరి కావడం.. ఈ క్రమంలో నకిలీ విద్యార్థుల గుట్టు రట్టవుతుంనే కోణంలో వివరాలు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నట్లు విద్యాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా లక్ష్యసాధన పూర్తికాకుంటే పాఠశాల వారీగా పరిశీలన చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.