
కదిలే చెక్క గుర్రంలా విద్యా శాఖ
- ఏపీ విద్యా శాఖ సమీక్షలో మంత్రి గంటా శ్రీనివాసరావు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఎన్ని కోట్లు ఖర్చు చేసినా, ఎంత ప్రయత్నించినా విద్యా శాఖపై రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు క్షేత్ర స్థాయిలో అమలు కావడంలేదని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వ్యక్తంచేశారు. విద్యా శాఖ కదిలే చెక్క గుర్రంలా తయారైందని, నడుస్తున్నట్లుగా పైకి కనిపిస్తున్నా, ఒక్క అడుగు కూడా ముందుకు పడటంలేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖాధికారులతో సోమవారం ఇక్కడ నిర్వహించిన సమీక్ష సమావేశంలో, ఆ తర్వాత విలేకరులతోనూ గంటా మాట్లాడారు. విద్యా శాఖలో ఆధార్ లింకేజి, వెరిఫికేషన్‌ను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని, వచ్చే ఏడాదినుంచి ఆధార్ ఆధారంగానే అన్ని పనులూ జరుగుతాయని చెప్పారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి విద్యా శాఖాధికారులంతా నెలలో రెండు రోజులు బడిలోనే ఉండేలా వచ్చే నెల నుంచి ‘బడిలో బస’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్కూళ్లలో సదుపాయాల అభివృద్ధిపై ఒక కమిటీని నియమిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనానికి అన్ని స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు.
విద్యార్థినులపై వేధింపులు జరగకుండా ఉపాధ్యాయుల ప్రవర్తనను పరిశీలించేందుకు సీసీ కెమెరాలు, వెబ్‌క్యామ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎస్సీ ద్వారా నియమించే 10,300 మందినీ ఒక చోట చేర్చి సీఎం ప్రమాణం చేయిస్తారని చెప్పారు. అధికారులంతా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. తాడేపల్లిగూడెంలో నెలకొల్పాలనుకున్న నిట్‌ను కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కర్నూలులో ఏర్పాటు చేయాలనుకున్న ట్రిపుల్ ఐటీని తాడేపల్లిగూడేనికి మారుస్తున్నట్లు చెప్పారు. ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలని ఎంత ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి కోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా, మార్పు రాలేదని అన్నారు. మార్చి 11 నుంచి ఏపీలో జరిగే ఇంటర్ పరీక్షలకు 9,90, 164 మంది హాజరవుతున్నారని తెలిపారు.