వైఎస్‌ జగన్: ప్రతి రంగంలోనూ విజన్‌ | YS Jagan Review Meeting on Development in Several Departments in AP - Sakshi
Sakshi News home page

ప్రతి రంగంలోనూ విజన్‌

Published Fri, Aug 28 2020 4:33 AM | Last Updated on Fri, Aug 28 2020 6:01 PM

YS Jagan Mohan Reddy Speaks About Development In Several Departments - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి రంగంలో మనకో విజన్‌ ఉండాలని, అరకొర ఆలోచనలు వద్దని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ సమయానికి సమస్య పరిష్కారం అయ్యిందనిపించే విధానాలు వద్దని, మంచి విజన్‌తోనే సమూల పరిష్కారాలు వస్తాయని చెప్పారు. ఈ విషయంలో ఖర్చు గురించి ఆలోచనలు వద్దని సూచించారు. ఆక్వా ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పశు సంవర్థక, మత్స్య శాఖ కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష  నిర్వహించారు. పెద్ద ఆలోచనలు, స్పష్టమైన విజన్‌తో పాటు పాదయాత్రలో స్వయంగా చూసిన పరిస్థితులను సమూలంగా మార్పు చేయాలనే ధృడ సంకల్పంతోనే వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. దీని వల్ల మార్పు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

విద్యా రంగంలో గొప్ప పనులు
► ప్రభుత్వ స్కూళ్లలో నాడు –నేడు పనులు చేపట్టాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు తీసుకు వస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా మనం నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితిలో ఉన్నామంటే చాలా విచారకరం. 
► ఈ పరిస్థితులను, జీఈఆర్‌ రేషియోను మార్చబోతున్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు చేయలేదు. 

అన్ని రంగాల్లో సమూల మార్పులు
► ప్రతి రంగంలోనూ గణనీయమైన మార్పులు తీసుకు వస్తున్నాం. కొత్తగా 16 బోధనాసుపత్రులతో కలిపి మొత్తంగా 27 బోధనాసుపత్రులు రాష్ట్రంలో ఉండబోతున్నాయి.
► మంచి చేయాలని, మంచి పనులు చేయాలని గట్టిగా అనుకుంటే, అంకిత భావంతో ముందుకు వెళ్తే.. దేవుడు తప్పకుండా సహాయ పడతాడు.
► పెద్దగా ఆలోచనలు చేయాలి. ఆ ఆలోచనల ద్వారా ఆ రంగంలో అందరికీ గణనీయమైన మేలు జరగాలి.

విజన్‌ ఏంటనేది ముందుగా నిర్దేశించుకోవాలి. అరకొరగా ఆలోచనలు చేయకూడదు. ఈ దిశలో డబ్బు ఖర్చు గురించి పట్టించుకోవద్దు. ఇలా పెద్ద ఆలోచనలు చేయడం వల్లే విప్లవాత్మక మార్పులు తీసుకు రాగలుగుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం సహా అనేక రంగాల్లో గొప్ప నిర్ణయాలను అమలు చేస్తున్నాం.

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
► వ్యవసాయ రంగంలో పూర్తి స్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం. 10 వేలకు పైగా ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయంటే.. అదొక విజన్‌ వల్ల వచ్చాయి. వ్యవసాయ రంగంలో నాణ్యతను పెంచే ఆలోచన మార్గంలోనే ఆర్బీకేలు వచ్చాయి.
► విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు తదితర అంశాల్లో క్వాలిటీని తీసుకు రావాలని, రైతులను మోసం చేసి దళారీలు బాగుపడే పరిస్థితుల నుంచి వారిని బయటకు తీసుకు రావాలని ఆలోచన చేసి వీటిని ప్రారంభించాం. 
► రైతును దగా కానీయకుండా, నాణ్యమైన సేవలను రైతు ఊర్లోనే, అతని గడప వద్దకే చేర్చాలన్న ఆలోచనతోనే ఆర్బీకేలు వచ్చాయి. ఇ క్రాపింగ్‌ విషయంలోనూ ఇలాగే ఆలోచించాం. గ్రామాల్లోనే రెవిన్యూ, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, ఆక్వా అసిస్టెంట్లు, సర్వేయర్లు ఉన్నారు. బీమా కావాలన్నా, పంట రుణం కావాలన్నా, ప్రభుత్వం పంట కొనుగోలు చేయాలన్నా.. ఇ–క్రాపింగ్‌ చాలా ముఖ్యం. 
► విత్తనం వేసేముందే.. ఆర్బీకేల్లో వివిధ పంటలకు కనీస గిట్టుబాటు ధరలను పోస్టర్‌ ద్వారా ఆర్బీకేల్లో పెడుతున్నాం. అంతకన్నా తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా చూస్తాం. ఇవి కాకుండా పంటలు, ధరలపై ఆర్బీకేలు రైతులకు సూచనలు, సలహాలు ఇస్తాయి. 
► ఇందు కోసం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సలహా మండళ్లను ఏర్పాటు చేస్తున్నాం. రైతులతో ఇంటరాక్ట్‌ కావడానికి కూడా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేసుకున్నాం. రైతు నష్టపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. 

రూ.4 వేల కోట్లతో గోదాములు
► గోడౌన్లు, ప్రీ ప్రాసెసింగ్, వ్యవసాయ పరికరాలు.. అన్నీ ఏర్పాటు చేయబోతున్నాం. మండలాల్లో కోల్డ్‌ స్టోరేజీలు రాబోతున్నాయి. వీటన్నింటి కోసం దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ప్రతి ఊళ్లో జనతా బజార్లునూ తీసుకు వస్తున్నాం.
► రైతుల వద్ద నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉత్పత్తులను సరసమైన ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. వాల్యూ ఎడిషన్‌ కోసం ప్రీ ప్రాసెసింగ్, ప్రాసెసింగ్‌ విధానాలు తీసుకు వస్తున్నాం. 
► ఒక విజన్‌లో భాగంగా ఇవన్నీ ఏర్పాటయ్యాయి. ప్రతి చోటా ప్రతి సమస్యకూ పరిష్కారంగా అనేక ఆలోచనలు చేసి ఆర్బీకేల పరిధిలో ఈ కార్యక్రమాలు చేపట్టాం. మిగతా రంగాల్లో కూడా సమస్యల పరిష్కారానికి అధికారులు పెద్ద ఆలోచనలు చేయాలి.

ఏ ఆలోచన చేసినా పూర్థి స్థాయిలో పరిష్కారాలు రావాలి. అందరికీ మేలు జరగాలి. పాదయాత్రలో నా కళ్లతో చూసిన పరిస్థితులను మార్పు చేయాలనే ఉద్దేశంతోనే పని చేస్తున్నాం. దేవుడు, ప్రజలు ఆశీర్వదించి ఈ స్థానంలో కూర్చోబెట్టారు. అందరికీ మంచి చేయాలనే దిశగా అడుగులేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement