
ముఖంపై మొటిమలు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య
పార్వతీపురం: ముఖంపై మొటిమలు వచ్చాయని ఓ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురంలోని వైకేఎం కాలనీకి చెందిన గెంబలి సాయితేజ(16) పట్టణంలోని ఓ ప్రై వేట్ కళాశాలలో ఇంటర్‌మీడియెట్ ఎంపీసీ ద్వితీయసంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల తన ముఖంపై మొటిమలు కనిపించాయి. వాటిని పదే పదే అద్దంలో చూసుకొని మనోవేదన చెందాడు. వీటిపై తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద తరచూ చెప్పి వాపోయేవాడు. మొటిమలు వచ్చినప్పటినుంచి ముఖానికి రుమాలు కట్టుకొని కళాశాలకు వెళ్తుండేవాడు. అదేమంటే మొటిమల గూర్చి మాట్లాడేవాడు.
గత ఆదివారం సాయంత్రం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం స్థానిక వైకేఎం కాలనీ శివారున గల ఓ బావిలో సాయితేజ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.