విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు | Students' lives are being destroyed | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు

Published Sat, Nov 28 2015 3:33 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు - Sakshi

విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు

సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలకు సేవలందించే విషయంలో హైకోర్టు శుక్రవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రంగా మండిపడింది. ఒకరిని ఒకరు నిందించుకుంటూ విద్యార్థులకు ఏమీ చేయడంలేదని నిప్పులు చెరిగింది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉభయులూ కూడా తమ ఉత్తర్వులను అమలు చేయలేదని హైకోర్టు మండిపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 4న ఉత్తర్వులు జారీ చేస్తే, ఇరువురూ కూడా తీరిగ్గా నవంబర్‌లో స్పందించారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

తమ ఉత్తర్వులు జారీ తరువాత, వాటిని అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో రాతపూర్వకంగా ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని అంబేడ్కర్ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్‌ను ఆదేశించింది. అలాగే కొన్ని కోర్సులను అర్ధంతరంగా నిలిపేయడంపై కూడా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు సేవలను నిలిపేస్తూ తెలుగు వర్సిటీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ వర్సిటీ సేవలను నిలిపేసిందని, దీని వల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను మరోసారి విచారించిన సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పి.వేణుగోపాల్ స్పందిస్తూ, ఏపీలోని సేవా కేంద్రాలకు సేవలందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను సక్రమంగా అమలు చేయలేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు తాము సేవా కేంద్రాల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు విడుదల చేశామన్నారు.

దీనికి తెలంగాణ ఏజీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, ఏపీ సర్కార్ జారీ చేసిన జీవో కేవలం తెలుగు వర్సిటీకి సంబంధించింది మాత్రమేనని, అందులో అంబేడ్కర్ వర్సిటీ ప్రస్తావన లేదన్నారు. దీంతో జీవోను పరిశీలించిన ధర్మాసనం, అందులో అంబేడ్కర్ వర్సిటీ గురించి ఎందుకు ప్రస్తావించలేదని వేణుగోపాల్‌ను నిలదీసింది. అంబేడ్కర్ వర్సిటీ వెబ్‌సైట్ నుంచి ఏపీలోని 92 సేవా కేంద్రాల వివరాలను తొలగించిందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పం దించింది.  రిజిస్ట్రార్ సుధాకర్‌తో సంప్రదించి సేవా కేంద్రాలు తొలగించలేదని తెలంగాణ ఏజీ కోర్టుకు చెప్పారు. దీంతో ధర్మాసనం, ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్‌కు ఏదో ఉద్దేశాలున్నాయని అనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement