స్టైలిష్.. క్రేజీ..
ఫిడ్జెట్ స్పిన్నర్‌కు గిరాకీ
ఒత్తిడి తగ్గుతుందని కొందరు..
సరదా కోసమని మరికొందరు
ఊపందుకున్న విక్రయాలు
మారాం చేస్తున్న పిల్లలు
పెద్దలదీ అదే దారి
కొత్తొక వింత.. ఇదీ తెలుగు నానుడి. ఇప్పుడిది అక్షరాలా నిజమైంది. సినిమాలు, టీవీలు ప్రజలపై ఎంత ప్రభావం చూపుతాయో అని చెప్పడానికి ఈ కథనమే ప్రత్యక్ష నిదర్శనం.
తణుకు :
ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా రకరకాల రంగులతో గిర్రున తిరుగుతున్న ఓ చక్రం ఆకర్షణీయంగా దర్శనమిస్తోంది. దీనిపేరు ఫిడ్జెట్ స్పిన్నర్. ఇదో ఆట వస్తువు. దువ్వాడ జగన్నాథం సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దీనిని వాడాడు. అంతే... ఇది క్రేజీగా మారిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరి చేతుల్లోనూ ఇమిడిపోతోంది.. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసమని కొందరు.. సరదా కోసమని మరికొందరు.. ఏదేమైనా ఈ స్పిన్నర్ ప్రస్తుతం మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది.
రూ.50 నుంచి అందుబాటులో..
జిల్లాలో స్పిన్నర్లకు ప్రస్తుతం గిరాకీ బాగా పెరిగింది. బ్యాట్‌మేన్, ఎల్‌ఈడీ లైట్లు, సైకిల్ ఛైన్, బ్లూటూత్ వంటి రకాలతోపాటు కొన్ని బంగారంతో చేసిన ఫిడ్జెట్ స్పిన్నర్లూ అందుబాటులో ఉన్నాయి. రూ.50 నుంచి రూ.500 వరకూఇవి పలుకుతున్నాయి. ఆన్‌లైన్‌లో సైతం వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. జిల్లాలో నిత్యం వందల సంఖ్యలో స్పిన్నర్లు అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోందని సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ
మూడు రెక్కలతో మధ్యలో చక్రం మాదిరి ఉండే ఫిడ్జెట్ స్పిన్నర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. అత్యధికంగా అమ్ముడుబోతున్న ఆటవస్తువుల్లో ఇది ఒకటిగా ప్రాచూర్యం పొందింది. 1993లోనే స్పిన్నింగ్ టాయ్ పేరుతో ఇది తయారైనా అప్పట్లో అంత ఆదరణ రాలేదు. ఇజ్రాయిల్‌కు చెందిన ఒక మహిళ దీన్ని తయారు చేసినట్టుగానూ.. కేథరిజ్ హిట్టింజర్ అనే వ్యక్తి తయారు చేశాడని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో గతేడాది దీనిపై కథనం ప్రచురితం కావడంతో ఒక్కసారిగా ప్రాచూర్యంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. స్ట్రెస్ రిలీజింగ్ టాయ్ అంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చైనాలోని సెల్‌ఫోన్ యాక్సరీస్ తయారు చేసే కంపెనీలూ ఈ స్పిన్నర్లు తయారీలో నిమగ్నమయ్యాయంటే వీటికి ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఒత్తిడి తగ్గినా..
ఇప్పుడు ఎవరి చేతుల్లో చూసినా ఫిడ్జెట్ స్పిన్నర్ దర్శనమిస్తోంది. దీనివల్ల కొంత మేర ఒత్తిడి తగ్గించుకునేందుకు అవకాశం ఉంది. అయితే దీన్ని అతిగా వినియోగిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం దీనిపై పిల్లల్లో క్రేజ్ పెరిగింది. ఒక్కోసారి దీనికి బానిసలుగా మారితే మాన్పించడానికి కష్టపడాల్సి వస్తుంది.
వై.రామకృష్ణ, మానసిక నిపుణలు, తణుకు