కాగితాలకే పరిమితమా?
- చిరు, నవధాన్యాలంటూ రెండేళ్లుగా ఊరిస్తున్న వ్యవసాయ శాఖ
- ఆచరణలో మాత్రం వైఫల్యం
- కొరవడిన ప్రచారం, ప్రోత్సాహం
- వేరుశనగకే మొగ్గు చూపుతున్న రైతులు
- 1960–80 మధ్య కాలంలో నవధాన్యాలదే హవా
అనంతపురం అగ్రికల్చర్ : చిరుధాన్యాలు, తృణధాన్యాలు, నవధ్యానాలు, బహుధాన్యాలు, పప్పుధాన్యాలు... ఈ పేర్లు గత రెండు, మూడేళ్లుగా బాగానే విన్పిస్తున్నాయి. లక్షల హెక్టార్లలో ఈ పంటలను సాగులోకి తెస్తామని వ్యవసాయ శాఖ ప్రతియేటా ప్రచార ఆర్భాటం చేస్తోంది. ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఏక పంట విధానానికి స్వస్తి చెబుతూ పంటల్లో వైవిధ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందించామని ఖరీఫ్ సమయంలో ప్రకటనలు చేయడం.. చివరికి చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. వేరుశనగ పంట విస్తీర్ణాన్ని బాగా తగ్గించి ఆ స్థానంలో జొన్న, సజ్జ, రాగి, కొర్ర, మొక్కజొన్న, కంది, ఆముదం, పత్తి, పొద్దుతిరుగుడు, అలసంద, పెసర, మినుము పంటల విస్తీర్ణం బాగా పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సాధ్యం కావడం లేదు.
ఈ ఖరీఫ్‌లో సాగుకు సమయం ఆసన్నమైనా వ్యవసాయశాఖ దగ్గర సరైన విత్తన ప్రణాళిక కూడా లేకపోవడం గమనార్హం. నవధాన్యపు కిట్లు అంటూ కంటితుడుపుగా ఏడు రకాల విత్తనాలు కలిపి ఐదు కిలోల చొప్పున ఇస్తున్నారు. ఈ కిట్లలో విత్తన నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్టిఫైడ్ సీడ్ కాకుండా మామూలు విత్తనాలు అందులో ప్యాక్ చేశారని రైతులు చెబుతున్నారు. కిట్లు కూడా సకాలంలో సిద్ధం చేయకపోవడంతో పంపిణీ మందకొడిగా సాగుతోంది. ఈ సీజన్‌లో ఐదు లక్షల కిట్లు ఇస్తామని చెప్పారు. ఇందులో ఇప్పటికీ 25 వేల కిట్లకు మించి పంపిణీ చేయలేదు.
బలం, బలహీనత వేరుశనగే..
2012, 2013 సంవత్సరాల్లో జిల్లాలో పర్యటించిన భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్) హైపవర్ టెక్నికల్ కమిటీ జిల్లా రైతుల బలం, బలహీనత వేరుశనగ పంటేనని గుర్తించింది. వేరుశనగ విస్తీర్ణాన్ని బాగా తగ్గించి.. దాని స్థానంలో చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటల సాగు బాగా పెంచితే కానీ వ్యవసాయం లాభసాటి కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది. నాలుగేళ్లు అవుతున్నా ఆ దిశగా అడుగులు మాత్రం పడటం లేదు.
గతంలో ఈ పంటలదే హవా
జిల్లా వ్యవసాయ చరిత్రను తిరగేస్తే.. గతంలో పంటల వైవిధ్యం స్పష్టంగా ఉండేది. నాలుగు నుంచి పది రకాల పంటలు పండించేవారు. తీవ్ర కరువులు ఏర్పడినా తిండి గింజలకు సమస్య ఉండేది కాదు. హరిత విప్లవం నేపథ్యంలో జిల్లా వ్యవసాయ రూపురేఖలు మారిపోయాయి. చిరుధాన్యాలు, నవధాన్యపు పంటలకు స్థానం లేకుండా పోయింది. వాటి స్థానంలో వాణిజ్య పంటగా వేరుశనగ వచ్చింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పదేళ్ల ఒకసారి కూడా వేరుశనగ పండే పరిస్థితి లేదు. 1960కు ముందు నుంచి 1985 వరకు జిల్లాలో చిరుధాన్యపు పంటలదే రాజ్యం. ఆరికలు, సామలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సజ్జ తదితర పంటలు బాగా పండించేవారు. 1961–62 సీజన్‌లో ఈ రకం పంటలు ఏకంగా 5.55 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. అప్పట్లో వేరుశనగ 1.94 లక్షల హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. పప్పుధాన్యాలు కూడా 1.10 లక్షల హెక్టార్లలో పండించారు.
వరి కూడా 50 వేల హెక్టార్లకు పైగా వేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 1971–72లో చిరుధాన్యపు పంటల విస్తీర్ణం 4.01 లక్షల హెక్టార్లు కాగా.. వేరుశనగ 2.55 లక్షల హెక్టార్లలో వేశారు. 1980 దశకం వరకు వరి, వేరుశనగ, చిరుధాన్యాలు, పప్పుధాన్యపు పంటల సాగులో సమతుల్యత బాగా కనిపించింది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1991–92 సంవత్సరంలో చిరుధాన్యపు పంటలు కేవలం 60 వేల హెక్టార్లకు పరిమితమయ్యాయి. ఇదే తరుణంలో వేరుశనగ ఒక్కసారిగా 7.35 లక్షల హెక్టార్లకు ఎగబాకింది. ఇక 2001–02లో చిరుధాన్యపు పంటలు 30 వేల హెక్టార్లకు పడిపోగా.. వేరుశనగ 7.80 లక్షల హెక్టార్లకు చేరుకుంది.
2010–11 విషయానికొస్తే చిరుధాన్యపు పంటలు 20 వేల హెక్టార్లకు మాత్రమే పరిమితం కాగా.. వేరుశనగ 8.34 లక్షల హెక్టార్లకు పెరిగింది. గత నాలుగైదేళ్లుగా వేరుశనగ విస్తీర్ణం కాస్త తగ్గినా.. దాని స్థానంలో చిరు, నవధాన్యపు పంటల విస్తీర్ణం పెరగకపోవడం గమనార్హం. 2015 ఖరీఫ్‌లో కొంత పెరిగినట్లు కనిపించినా తెగుళ్లు ఆశించి పంటలను దెబ్బతీయడంతో 2016లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు విస్తీర్ణం కూడా బాగా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐదారేళ్ల కిందటి వరకు ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 9 నుంచి 9.50 లక్షల హెక్టార్లుగా ఉండేది. ఆ తర్వాత 8 నుంచి 8.20 లక్షల హెక్టార్లకు పరిమితమైంది.