ఫలించిన జలయజ్ఞం
Published Sat, Jul 23 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
కశింకోట: మండలంలోని అమీన్‌సాహెబ్‌పేట గ్రామం వద్ద శారదానదిపై నిర్మించిన నరసాపురం ఆనకట్ట నుంచి శనివారం ప్రయోగాత్మకంగా సాగునీటిని విడుదల చేశారు. కాలువ నుంచి వంద క్యూసెక్కుల సాగునీరు ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడం, తలుపుల అమరిక పనులు దాదాపు పూర్తి కావడంతో నీటిని విడుదల చేశారు. దీంతో రైతుల ఐదేళ్ల కల నెర వేరినట్టయింది. రైతుల కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ ఆనకట్టను మంజూరు చేశారు. దీనికి రూ.16.17 కోట్లు మంజూరు చేశారు. నిధులు సరిపోకపోవడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు కల్పించుకొని విశాఖ డెయిరీ ద్వారా తలుపుల ఏర్పాటుకు రూ.కోటీ 30 లక్షలు సమకూర్చారు. ఆరు నెలల క్రితం చేపట్టి ఎట్టకేలకు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వరద నీరు వచ్చి చేరడంతో శనివారం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కాలువ నుంచి వంద క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల కశింకోట, యలమంచిలి మండలాల్లో సుమారు 3,854 ఎకరాలకు సాగునీరు అందనుంది.
Advertisement