మనోవేదనకు గురై రైతు ఆత్మహత్యాయత్నం
Published Wed, Sep 28 2016 12:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
పర్వతగిరి : వ్యవసాయబావి బాట విషయంలో పెద్దమనుషులు చేసిన తీర్మానంతో మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని చింతనెక్కొండలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు పెద్దకాసు బిక్షపతి ఇదే గ్రామానికి చెందిన అకినేపల్లి ఆనందచారికి చెందిన వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. అతడి వ్యవసాయ బావికి వెళ్లే బాటపై గతంలో ఆనందచారితోపాటు అతడి అన్నదమ్ములకు ఉమ్మడిగా పొత్తు ఉండేది. అయితే ఆనందచారి భూమిని బిక్షపతి కొనుగోలు చేశాక ఆ బాట మీదుగా అతడు నడిచేందుకు ఆనందచారి దాయాదులు అంగీకరించలేదు. దీంతో ఇరువర్గాలు పెద్దమనుషులను ఆశ్రయించారు. దీంతో ఆనందచారి అన్నదమ్ముళ్లకు రూ.50 వేలు చెల్లించి ఆ బాటను బిక్షపతి వాడుకోవాలని తీర్పు చెప్పారు. పొత్తుల బాటకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని మనోవేదనకు గురైన బిక్షపతి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బిక్షపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. తప్పుడు తీర్పు చెప్పిన పెద్ద మనుషులపై కఠిన చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.
Advertisement
Advertisement