పసుపుమయమైన ఎడ్లబండిపై మంత్రి శిద్ధా, కరణంతో కలసి ఊరేగుతున్న కలెక్టర్ సుజాత శర్మ
ఒంగోలు : యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో సోమవారం నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో కలెక్టర్ సుజాతశర్మ తెలుగుదేశం పార్టీ జెండాలతో అలంకరించిన ఎడ్లబండిపై ఊరేగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పలు విమర్శలకు తావిచ్చింది. ఏరువాక కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కాదు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమం. తొలకరి వర్షాల నేపథ్యంలో ఏరువాక పౌర్ణమి నాడు వ్యవసాయ పనులు ప్రారంభించడం రైతులకు ఆనవాయితీ. ఈ ఏడాది తొలిసారిగా ఏరువాక కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ కార్యక్రమానికి ఆత్మ శాఖ నిధులు వినియోగించుకోవాలని సూచించింది. ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. దానిలో భాగంగా పర్చూరు నియోజకవర్గంలోని యద్దనపూడి మండలం చింతపల్లిపాడులో అధికారులు సోమవారం ఏరువాక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, టీడీపీ నేత కరణం బలరాం, స్థానిక ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎడ్లబండిపై ఊరేగింపు నిర్వహించారు. అయితే, ఆ ఎడ్లబండిని తెలుగుదేశం జెండాలతో అలంకరించి పసుపుమయం చేశారు. అదే బండిపై మంత్రి, టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ సుజాతశర్మ ఊరేగారు. పార్టీలకతీతంగా జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాత్రం టీడీపీ జెండాలు కట్టిన బండిలో ఊరేగడం విమర్శలకు దారితీసింది.