
అగ్నిగుండంలా మారిన ఏపీ
- నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం
- కుతకుతలాడుతున్న కోస్తా, రాయలసీమ
- సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత
- 186 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు నమోదు
- రోజురోజుకూ పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
- పెరుగుతున్న టైఫాయిడ్, జాండీస్, అతిసారం కేసులు
- వేసవి వ్యాధిగ్రస్తులతో ఆస్పత్రులు కిటకిట
సాక్షి, హైదరాబాద్/ విశాఖపట్నం: రాష్ట్రంలో ఎండలు భగభగా మండుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. కణ కణలాడుతున్న ఎండలతో వడగాడ్పులు భయపెడుతున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ఎండవేడి చురుక్కుమనిపిస్తోంది. సాయంత్రం అయిదు గంటలకు కూడా వేడి సెగలు తగ్గడంలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే ఐదారు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలను భయపెడుతున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో అత్యధికంగా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ, వడగాడ్పులకు ఆస్కారం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని, అత్యవసర పరిస్థితుల్లో వెళ్లే వారు తగు ఉష్ణతాప నివారణ చర్యలు తీసుకోవాలని ఠసూచిస్తున్నారు. ఇప్పటికే ఉష్ణతాపాన్ని తట్టుకోలేక ఇరు రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇకపై ఎండలు మరింత విజృంభిస్తాయన్న నిపుణుల హెచ్చరికలతో మరింత బెంబేలెత్తుతున్నారు.
47 డిగ్రీల మంట
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 197 మండలాల్లో, మంగళవా రం 186 మండలాల్లోనూ తీవ్రమైన వడగాడ్పులు నమోదయ్యాయి. మంగళవారం వైఎస్సార్ జిల్లాలో అత్యధికంగా 31 మండలాల్లో వడగాడ్పులు రికార్డయ్యాయి. ఆటోమేటి క్ వెదర్ స్టేషన్ల రికార్డుల ప్రకారం గత 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో 43 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో 47.3, విశాఖపట్నం జిల్లాలోని చోడవరంలో 46.2, విశాఖపట్నం జిల్లాలోని బొండపల్లిలో 45.9, పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లిలో 45, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా కంభంలో 46, వైఎస్సార్ జిల్లా కొండాపురంలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకూ అధికంగా నమోదవుతుండటం గమనార్హం. తీవ్రంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు, పిల్లలే కాకుండా సాధారణ ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు.
పెరుగుతున్న వడదెబ్బ మరణాలు
తీవ్రమైన ఎండలకు భూతాపం, వడగాడ్పులు తోడు కావడంతో వడదెబ్బ మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 20, విశాఖపట్నంలో 21, విజయనగరంలో 24 మండలాల్లో వడగాడ్పులు నమోదయ్యాయి. అనధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 2,450 వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. అధికారిక సమాచారం ప్రకారమే గత ఏడాది రాష్ట్రంలో వడదెబ్బవల్ల 1,677 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 333 మంది చనిపోయారు.
ఈ సంవత్సరం పెరుగుతున్న ఎండలతో ఈ రికార్డు చెరిగిపోయే ప్రమాదం ఉందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పెరుగుతున్న ఎండలు, వడగాడ్పులకు వ్యాధులు కూడా తీవ్రరూపం దాల్చుతున్నాయి. టైఫాయిడ్, జాండీస్ కేసులు పెరుగుతున్నాయి. అతిసార బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. డయేరియా బాధితులు ఈ వేడివల్ల వెంటనే నీరసించిపోతున్నారు. వేసవి వ్యాధిగ్రస్తులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ఎండల ప్రభావంవల్ల జ్వరాలు కూడా ఎక్కువవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
తెలంగాణలోనూ భగభగ
తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వడగాడ్పులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం మంగళవారం రాత్రి హెచ్చరించింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 44 డిగ్రీలు, నిజామాబాద్‌లో 43, హైదరాబాద్‌లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బకు 28 మంది మృతి
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలో వడగాలులు వణికిస్తున్నాయి. మంగళవారం వడదెబ్బకు గురై 28మంది మృత్యువాత పడ్డారు. చిత్తూరు, వైఎస్‌ఆర్, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు వడదెబ్బల కారణంగా మరణించారు.