శంకర్‌దాదాలు!
కాసులకోసం కడుపుకోత
అవసరం లేకపోయినా 22మందికి సిజేరియన్ కాన్పులు
ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు
ఒక్కో ఆపరేషన్‌కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు వసూలు
కోయిలకొండలో ఓ ఆర్‌ఎంపీ ఆగడాలు
గ్రామాల్లో ప్రభుత్వవైద్యంపై కొరవడిన అవగాహన
కోయిల్‌కొండ మండలం చన్మన్‌పల్లితండాకు చెందిన రాధిక ధర్మాపూర్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతోంది. పాపకు కడుపునొప్పిరావడంతో పాఠశాలనుంచి తండాకు వచ్చింది. రాధికను ఆమె తాత అభంగపట్నం గ్రామంలోని ఖలీం అనే ఆర్‌ఎంపీ నడుపుతున్న దవాఖానాకు తీసుకెళ్లాడు. అక్కడ చూపిస్తే ఆపరేషన్ చేయించాలని, మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రెఫర్ చేశాడు. మరుసటి రోజు రాధికకు ఆపరేషన్ చేశారు. ఇంతకు రాధికకు కడుపునొప్పి ఎందుకు వచ్చిందో చెప్పింది లేదు. కేవలం డబ్బుల కోసం చిన్నారి కడుపును కోశారు.
కోయిల్‌కొండ మండల పరిధిలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో 112మందికి అనవసరపు ఆపరేషన్లు చేశారని తేలింది. అవి కూడా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే. అంటే వీరు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారన్నది సుస్పష్టమవుతోంది.
సాక్షి, మహబూబ్‌నగర్
పేదల ప్రజల అమాయకత్వం వారికి ఆసరా.. శస్త్రచికిత్సలు అవసరం లేకపోయినా కాసుల కోసం ఆపరేషన్లు చేసేస్తున్నారు. కమీషన్ వస్తుందంటే చాలు ఎంతకైనా సిద్ధపడుతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనవసరపు ఆపరేషన్లు చేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్‌కొండ మండలంలో కన్నతల్లులకు కడుపుకోతలు మిగుల్చుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. కలెక్టర్ రొనాల్డ్‌రోస్ తనిఖీలతో అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. మండలంలోని అభంగపట్నం గ్రామంలో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నా ఖలీం అనే వ్యక్తి చిన్నచిన్న జబ్బులకు వైద్యంచేస్తూ నిర్లక్షరాస్యులు, పేదలను నమ్మించాడు.
కొన్నిరోజుల తరువాత కడుపునొప్పితోపాటు ఇతర వ్యాధులు వచ్చినవారు ఖలీం వద్దకు వైద్యం కోసం వస్తే ‘మీకు ఆపరేషన్ చేయాలని లేకుంటే రోగం నయం కాదని’ చెప్పి జిల్లా కేంద్రంలోని కొన్ని డయాగ్నస్టిక్ సెంటర్లకు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. గ్రామంలో ఎవరిని తట్టినా తమకు గర్భసంచి ఆపరేషన్ జరిగిందని, అపెండిసైటిస్ ఆపరేషన్లు జరిగాయని చెబుతుండడం ఖలీం వైద్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్కో ఆపరేషన్‌కు రూ.25వేల నుంచి రూ.35వేల వరకు దండుకుని తనకిచ్చే కమీషన్‌ను తీసుకుంటున్నాడని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 20ఆర్‌ఎంపీల క్లీనిక్‌లు ఉండగా, అనధికారికంగా 150కిపైగా ఉంటాయి.
కలెక్టర్ పర్యటనతో వెలుగులోకి..
ఈనెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన ది నోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు వేయిం చేందుకు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ కోయిలకొండ మండలంలోని చన్మయిపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న కలెక్టర్‌కు ఇద్దరు బాలికలు కనిపించారు.
బడికి వెళ్లకుండా బయటకు ఎందుకు వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ బాలికలు తమకు ఆపరేషన్ అయిందని చెప్పడంతో ఎవరు చేశారని.. ఏం ఆపరేషన్ అని కలెక్టర్ వారిని అడిగారు. దీంతో ఆర్‌ఎంపీ ఖలీల్ నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. వెంటనే కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అతడిపై విచారణ చేయాలని డీఎంహెచ్‌ఓకు ఆదేశాలు జారీచేశారు.
ఆర్‌ఎంపీ వైద్యంపై కొరవడిన నిఘా
గ్రామాల్లో విచ్చలవిడిగా వెలసిన ఆర్‌ఎంపీ క్లీనిక్‌లపై జిల్లా వైద్యాధికారులు దృష్టిసారించలేకపోతున్నారు. క్లీనిక్‌లకు వచ్చిన నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఆర్‌ఎంపీలు ప్రసవాలు, ఆపరేషన్లు, ఆబార్షన్లు చేస్తూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కోయిల్‌కొండమండలంలోని అభంగపట్నంలో క్లీనిక్ సెంటర్ నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఆపరేషన్లు చేయించిన ఆర్‌ఎంపీ ఖలీంపై కేసునమోదు చేసినట్లు కోయిల్‌కొండ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. పరారీలో అతడిని వెంటనే పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామన్నారు.
విచ్చలవిడిగా ఆర్‌ఎంపీ కేంద్రాలు
మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ, నారాయణపేట, కోస్గి, జడ్చర్ల, నవాబ్‌పేట, ధన్వాడ మండలాల్లో ఆర్‌ఎంపీల వైద్యం బాగా విస్తరించింది. ఇంజక్షన్లతో పాటు నెబ్యులైజర్, సెలైన్ బాటిళ్లు ఎక్కిస్తున్నారు. ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగినవారికి అత్యవసర సేవలు అందించేందుకు కూడా వెనుకాడడం లేదు. కొంతమంది ఫిజియోథెరపీలు ఎక్స్‌రే, ప్రిస్కిప్షన్లు రాస్తూ చికిత్స చేస్తున్నారు. ఇటీవల నారాయణపేటలోని ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు చేసిన చికిత్సకారణంగా రోగి కాలు నడవలేని పరిస్థితి ఏర్పడింది. రోగి ప్రమాదకరస్థితిలో ఉండగానే సంబంధిత నకిలీ వైద్యులు ఆ ప్రమాదం నుంచి బయటపడటానికి ఆయా శాఖలో ఉండే ఉన్నతాధికారులకు భారీస్థాయిలో ముడుపులు ముట్టచెప్పుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
112 ఆపరేషన్ల గుర్తింపు
కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని ఆరు తండాలు, రెండు గ్రామాల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి విచారణ చేయగా 112మందికి వివిధ రకాల ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. వీటిలో గర్భసంచి తొలగించినవి 41, అపెండిసైటిస్ 22, సిజేరియన్లు 49 ఉన్నాయి. దీంట్లో ఖలీల్ అనే ఆర్‌ఎంపీ 22ఆపరేషన్లు చేయించినట్లు విచారణలో తెలింది. ఇదిలా ఉండగా, పేదల వైద్యానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నాయని లెక్కలు చూపిస్తున్న ప్రభుత్వం గ్రామీణులకు ప్రభుత్వం వైద్యంపై నమ్మకం కలిగించలేకపోతుంది. ఏ చిన్నజబ్బు వచ్చినా ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారే తప్ప ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. కలెక్టర్ పర్యటనలో వెలుగులోకి వచ్చిన ఆపరేషన్లను పరిశీలిస్తే అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగినవే కావడం గమనార్హం.