సర్వేపై సందేహాలు
► పేరుకు గ్రామ కంఠాలు.. కానీ రోడ్ల
► సర్వే అని అనుమానం
► ఇళ్లు తొలగిస్తారేమోనని ఆందోళన
► మానసిక వేదన పడుతున్న ప్రజలు
ఉండవల్లి/పెనుమాక (తాడేపల్లి రూరల్) : ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో గ్రామ కంఠాలు నిర్ణయిస్తున్నామంటూ రెవెన్యూ అధికారులు రిటైర్డ్ సర్వేయర్లతో సర్వే కార్యక్రమం చేపట్టింది. గురువారం ఉండవల్లి గ్రామంలో సర్వే చేస్తుండగా, ప్రజలు అభ్యంతరం తెలియజేసి, మీరెందుకు సర్వే చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల్లో గ్రామ కంఠాలను నిర్ణయించేందుకు పని చేస్తున్నామని వారు తెలిపారు. వాస్తవానికి గ్రామ కంఠాల సర్వే చేస్తే గ్రామాల నలుమూలల నిర్వహించాల్సి ఉంది. అలాంటిది ఉండవల్లిలో పాత ఆర్‌అండ్‌బీ రోడ్డులో మాత్రమే ఈ సర్వే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వారం రోజుల క్రితం ఆర్డీవో శ్రీనివాసరావు ఉండవల్లిలో రోడ్ల విస్తరణ కోసం ఇళ్లు తొలగించాలని సూచించారు. దీంతో స్థానికులు అందరూ ఆయన ప్రతిపాదనను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. అయితే రోడ్ల కోసం సర్వే అని చెబితే ప్రజల్లో తిరుగుబాటు ఎక్కడ వస్తుందోనని అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో ఎత్తుగడను మార్చి గ్రామ కంఠాల సర్వే చేస్తున్నామని చెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.
రోడ్లు నిర్మించే ప్రాంతాల్లో గప్‌చుప్‌గా సర్వే క్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. పెనుమాక గ్రామస్తులు అయితే టీడీపీ ఆధ్వర్యంలో ఆర్డీవోను కలిసి, తాము పొలాలు కోల్పోయామని, రోడ్ల కోసం మా ఇళ్లు తొలగిస్తే మా పరిస్థితి ఏమిటో చెప్పాలని అధికారులను నిలదీశా రు. దీంతో ప్రభుత్వం 1932లో లెక్కల ప్రకారం రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు సర్వేలు చేయిస్తున్నారు. అయితే ఈ నివాసాలు అన్నీ కూడా 1952 తరువాత నిర్మాణం చేపట్టినవి.
1952 నుంచి ఇప్పటి వరకు అధిక సంఖ్యలో గృహ నిర్మాణాలు జరగడంతో పాటు స్థలాలు, ఇళ్లు కొనుగోలు, అమ్మకాలు సైతం జరిగాయి. ఈ క్రమంలో స్థల యజమానులు ఏళ్ల తరబడి స్థానిక పంచాయతీలకు పన్నులను చెల్లిస్తూనే ఉన్నారు. ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న రికార్డును ప్రస్తుతం బలవంతంగా అమలు పరచాలని ప్రభుత్వ ఉద్దేశమని పెనుమాక, ఉండవల్లి గ్రామాల ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసిస్తున్నారు.