మాతా, శిశు మరణాలపై సర్వే
మాతా, శిశు మరణాలపై సర్వే
Published Mon, Nov 7 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
28 మంది సీడీపీవోలకు బాధ్యతలు
ఒక్కో అధికారికి ఒక్కో ఏజెన్సీ పీహెచ్‌సీ బాధ్యతలు
రంపచోడవరం : ఏజెన్సీలో సంభవిస్తున్న మాతా శిశు మరణాలు, పోషకార లోపాలకు కారణాలను గుర్తించేందుకు జిల్లాలోని 28 మంది సీడీపీవోలకు ఏజెన్సీలో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఐటీడీఏ పీవో కేవీఎన్ చక్రధరబాబు ప్రకటించారు. ఒక్కో సీడీపీవో ఏజెన్సీలోని ఒక్కో పీహెచ్‌సీలో వారానికి నాలుగు రోజుల చొప్పున రెండు నెలల పాటు సర్వే నిర్వహిస్తారన్నారు.ఈ సర్వేకు అంగన్ వాడీ, వెలుగు, వైద్య సిబ్బంది సహకారం అందించాలని పీవో కోరారు. మాతా, శిశు మరణాలకు గల కారణాలను నిశితంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆయన సూచించారు. గిరిజనుల విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించి నిబంధనల మేరకు పరిష్కారం చూపాలని పీవో అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ సమావేశపు హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యల పరిష్కారం కోసం 85 మంది ఆర్జీలు అందజేశారు. గుంజి గూడెం, ఇసుకపట్ల గ్రామాలకు రోడ్లు వేయాలని ఆ గ్రామాల ప్రజలు కోరారు. తున్నూరు పంచాయతీ పరిధిలో రోడ్లు నిర్మించాలని ఆ గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీఓ నాయుడు, ఈఈ పీకే నాగేశ్వరరావు, ఎంపీడీవోలు శంకర్‌నాయక్, శ్రీనివాసుదొర, జీసీసీ డీఎం జోగేశ్వరరావు, అదనపు డీఎం అండ్ హెచ్‌ఓ పవన్ కుమార్, ఎస్‌ఎంఐ ఈఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Advertisement