రోడ్డెక్కిన ‘పారిశుద్ధ్య’ దండు..
రోడ్డెక్కిన ‘పారిశుద్ధ్య’ దండు..
Published Wed, Aug 24 2016 9:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
* కూలి డబ్బుల విషయంలో రేగిన వివాదం
* రూ.400 కు రూ.300 చేతిలో పెట్టిన అధికారులు
* కలెక్టర్ కల్పించుకోవడంతో సమస్యకు తెర
అమరావతి : అమరావతి, ధరణికోటలలో కృష్ణా పుష్కరాల 12 రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేసిన వినుకొండ పరిసర గ్రామాలకు చెందిన కార్మికులు కూలీ డబ్బుల వివాదంతో బుధవారం స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నాకు దిగారు. వివరాల్లోకెళ్తే.. పుష్కరాల్లో పారిశుద్ధ పనులు చేయటానికి వినుకొండకు జి. భాస్కర్ అనే మేస్త్రీ ఆధ్వర్యంలో పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన సుమారు 140 మంది కార్మికులు అమరావతికి వచ్చారు. మేస్త్రీ భాస్కర్ రోజుకు రూ.400 కూలి ఇస్తారని చెప్పి కూలీలను తీసుకురాగా 12 రోజులు పని చేశాక ప్రభుత్వ విధానాల ప్రకారం రూ.300 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పటంతో వివాదం మొదలైంది. దీన్ని వ్యతిరేకించిన కార్మికులు మెయిన్ రోడ్డుపై రాకపోకలను నిలిపేస్తూ అడ్డుగా కూర్చొని ధర్నాకు దిగారు. వీరికి స్థానిక సీఐటీయూ నాయకుడు సూరిబాబు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు షేక్ హష్మీ మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఎస్‌ఐ వెంకట ప్రసాద్ వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి కార్మికులకు కూలి డబ్బులు చెల్లించాలని కోరారు. దీంతో గ్రామ సర్పంచి గుడిశె నిర్మలాదేవి, పంచాయతీ కార్యదర్శి మోహన్‌చంద్, ఇతర అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి కూలీలకు డబ్బులు చెల్లించటానికి ఒప్పించారు. ఈలోపు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కూలీలకు రూ.400 చొప్పున కూలి చెల్లించాలని అదేశించటంతో అమరావతి గ్రామ సర్పంచి తన సొంత నిధులను చెల్లించటంతో వివాదం సమసింది.
Advertisement
Advertisement