sweepers
-
బెంగళూరులో చెత్త సంక్షోభం
బనశంకరి(బెంగళూరు): వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పౌరకార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం కారణంగా పౌరకార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో చెత్త సమస్య తలెత్తింది. బెంగళూరులో రోడ్లను స్వీపింగ్ యంత్రాలతో ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హమీ ఇచ్చేవరకు సమ్మె వదిలిపెట్టేది లేదని పౌర కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో నగర రోడ్లలో చెత్త రాశులుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. బెంగళూరులోని క్రీడా మైదానాలు, బస్టాండ్లు, బస్షెల్టర్లు, మార్కెట్లు ప్రాంతాల్లో చెత్తతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి చెత్త తొలగింపు నిలిచిపోయింది. బెంగళూరులో 70 శాతం మంది సమ్మె బెంగళూరు నగరంలో 18 వేల మంది పౌర కార్మికులు ఉండగా 70 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంపు, పర్మినెంట్ తదితరాలపై ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో 54,512 మంది కాంట్రాక్టు పౌర కార్మికులు ఉండగా వీరిలో 10,755 మందిని పర్మినెంట్ చేశారు. మిగిలిన కార్మికులను కూడా పర్మినెంట్ చేయాలని సమ్మెకు దిగారు. పౌర కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. సమ్మె వల్ల రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది. యంత్రాలతో చేయిస్తాం సమ్మె వల్ల చెత్త సమస్య తలెత్తిందని పాలికె పొడిచెత్త నిర్వహణ విభాగం ప్రత్యేక కమిషనర్ డాక్టర్ హరీశ్‌కుమార్ తెలిపారు. సోమవారం బీబీఎంపీలో మాట్లాడుతూ రెండు స్వీపింగ్ యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని యంత్రాలను సమకూర్చుకుంటామని చెప్పారు. -
కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా ధర్నా
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోడెల కుటుంబ దాష్టీకానికి బలైన బాధితులు నిరసన గళం వినిపిస్తున్నారు. కోడెల కుటుంబానికి వ్యతిరేకంగా సత్తెనపల్లి తహశీల్దారు కార్యాలయం ఎదుట ప్రభుత్వాసుపత్రి కాంట్రాక్టు స్వీపర్లు సోమవారం ధర్నా చేపట్టారు. కోడెల బినామీలైన విజయలక్ష్మి సహా, శ్రీనివాసరావు, సురేంద్రలు తమ పీఎఫ్ సోమ్మును కాజేశారని స్వీపర్లు ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. -
అక్కడ స్వీపర్లే నర్సులు..!
సాక్షి, గిద్దలూరు (ప్రకాశం): స్థానిక కమ్యూనిటీ వైద్యశాలలో వైద్యం కోసం వచ్చే వారికి పారిశుధ్య విభాగంలో పనిచేసే స్వీపర్లే సేవలందించాల్సిన దుస్థితి ఏర్పడింది. వైద్యశాలలో నర్సులు ఉన్నప్పటికీ రోగులను పట్టించుకోకుండా కుర్చీల్లో కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకే పరిమితమవుతున్నారు. వైద్యశాలల్లో ఐదుగురు డాక్టర్లు ఉన్నారు. వారు రోగులను పరీక్షించి మందులు, ఇంజక్షన్లు రాస్తారు. డాక్టర్ రాసిచ్చిన మందులు ఇంజక్షన్లను రోగులకు ఇవ్వాల్సిన నర్సులు.. ఆ పనిని స్వీపర్లతో చేయిస్తున్నారు. వైద్యశాలలో సుమారు 15 మంది వరకూ నర్సులు ఉన్నప్పటికీ రోగులకు అరకొరగా కూడా వైద్యసేవలు అందించకుండా తీవ్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ఇంజక్షన్లు వేయడం, సెలైన్లు పెట్టడం వంటి పనులన్నింటినీ పారిశుధ్య కార్మికులతోనే చేయిస్తున్నారు. దీనిపై రోగులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్వీపర్లు మరుగుదొడ్లు, వార్డులు శుభ్రపరచి అపరిశుభ్రమైన చేతులతో తమకు ఇంజక్షన్లు చేయడం, సెలైన్లు ఇవ్వడమేంటని ఆగ్రహిస్తున్నారు. అంతేగాకుండా ఎలాంటి శిక్షణ లేని స్వీపర్లు వైద్యసేవలు అందించడం వలన కొన్నిసార్లు రోగులు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంజక్షన్లు చేసే సమయంలో తీవ్రంగా నొప్పి, సెలైన్లు ఎక్కించే సమయంలో రక్తస్రావం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. నర్సులు చేయాల్సిన పనులను స్వీపర్లతో చేయించడం ఏంటని ఆయా సమయాల్లో నర్సులను నిలదీస్తున్నప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని, వారిలో ఏ విధమైన మార్పూ రావడం లేదని రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాయాలకు కట్లు కట్టేది.. కుట్లు వేసేది కూడా స్వీపర్లే... రోడ్డు ప్రమాదాలు, తదితర సంఘటనల్లో గాయాలపాలై వైద్యశాలకు వచ్చిన క్షతగాత్రులకు కట్టుకట్టి వైద్యం చేయాల్సిన నర్సులు పట్టించుకోకపోవడంతో పాటు ఆ పనులను స్వీపర్లతో చేయిస్తున్నారు. గాయాలకు స్వీపర్లే డ్రస్సింగ్ చేసి కట్టు కడుతున్నారు. కొందరికి కుట్లు కూడా వారే వేస్తున్నారు. స్వీపర్లు వైద్యం అందించడంపై కొందరు రోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. ప్రమాద సమయంలో తప్పడం లేదని సర్దుకుపోతున్నారు. దీనిపై వైద్యశాల వైద్యులకు చెప్పినా పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. డ్యూటీ డాక్టర్లైనా రోగులకు చేయి పట్టుకుని వైద్యం అందిస్తారుగానీ, నర్సులు మాత్రం రోగులను పట్టించుకోరన్న ఆరోపణలు ఈ వైద్యశాల నర్సులపై ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలలో నర్సులకు కౌన్సిలింగ్ ఇచ్చి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
సెక్యూరిటీ గార్డులే డాక్టర్లు!
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు అందించాల్సిన వైద్య సేవలను సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు అందిస్తున్నారు. సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు, వారి బంధువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభుత్వం రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించింది. రెండేళ్ల క్రితం ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడంతో ఇక్కడ రోజూ 30కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంతో పెద్దాసుపత్రి తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లే రోగులకు సెలైన్లు అమర్చుతూ, ఇంజెక్షన్లు వేస్తున్న దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక ఇక్కడ కాన్పు అయిన తర్వాత ఆడపిల్ల పుడితే ఒక రేటు, మగ పిల్లాడు పుడితే మరో రేటు చొప్పున ఆసుపత్రి సిబ్బంది వసూళ్లు కూడా చేస్తుండడం గమనార్హం. ఈ విషయం తెలిసినా వైద్య అధికారులు ఏమీ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. -
భద్రత లేని బతుకులు
నంగునూరు(సిద్దిపేట) : ‘మూడు దశాబ్దాలుగా పాఠశాలల్లో స్వీపర్లుగా పని చేస్తున్నా మాకు ఉద్యోగ భద్రత లేదు.. భరోసా ఇచ్చేవారు కరువయ్యార’ని పార్ట్‌టైం స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం కనికరించడం లేదని వాపోతున్నారు. పార్ట్ టైం స్వీపర్లుగా పని చేస్తూ జిల్లావ్యాప్తంగా ఎంతో మంది మరణించగా వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రోజూ పని చేస్తేనే పూట గడిచే తమకు ప్రభుత్వం సరైన వేతనాలు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని, జీతాలు రాకుంటే ఇల్లు ఎలా గడుస్తుందని వారు ప్రశిస్తున్నారు. పాఠశాలలు తెరచినప్పటి నుంచి మూసే వరకు తరగతి గదులు శుభ్రపరిచి, టాయిలెట్లు శుభ్రం చేస్తూ పిల్లలకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా చూస్తూ పొద్దంతా పని చేస్తున్నారు స్వీపర్లు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే వారికి ఇచ్చేది నెలకు రూ. 4 వేలు మాత్రమే. ఇది కూడా ప్రతీ నెల వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. పెరుగుతున్న ఖర్చులను తట్టుకునేందుకు భార్యా పిల్లలతో పాటు తాము సెలవు దినాల్లో కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇందులో చాల మంది స్వీపర్లు వికలాంగులు, వృద్ధులు కావడంతో ఏ పనీ చేతకాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది పాఠశాలల్లో పార్ట్ టైం స్వీపర్లుగా పని చేస్తుండగా నంగునూరు మండలంలో ఏడుగురు పార్ట్‌టైం, ఒకరు ఫుల్‌టైం స్వీపర్‌గా, సిద్దిపేట మండలంలో 11 మంది పార్ట్ టైం స్వీపర్లుగా, చిన్నకోడూరు మండలంలో 9మంది పని చేస్తున్నారు. మూడు జీఓలు జారీ చేసినా ఫలితం శూన్యం పార్ట్ టైం, ఫుల్ టైం స్వీపర్లను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం 1994లో ఏప్రిల్ 22న (ఆర్థిక ప్రణాళిక శాఖ ఎఫ్.డబ్ల్యూ.పి.సి–3) 112 జీఓ జారీ చేసింది. అలాగే 1997లో జూలై 23 న సైతం 112 జీఓ ద్వారా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తున్నామని ప్రకటించినా ఉమ్మడి మెదక్ జిల్లాలో అమలు కాలేదు. తర్వాత సీపీఆర్, ఆర్ఈ 2011లో, 2013న మరో సారి పార్ట్ టైం స్వీపర్లను పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. జీఓ ప్రకారం ఐదేళ్లు పని చేసిన ఫుల్ టైం స్వీపర్లను, పది సంవత్సరాలు పని చేసిన పార్ట్‌టైం స్వీపర్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేయాల్సి ఉంది. జీఓ ఎంఎస్ నంబర్ 250 ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో 49 మందిని స్వీపర్ కమ్ నైట్వాచ్మెన్లుగా పదోన్నతులు కల్పించారు. అయినా ఏడు సంవత్సరాలుగా పార్ట్ టైం, 21 సంవత్సరాలుగా ఫుల్‌టైం స్వీపర్‌గా పని చేస్తున్న తనకు ఇప్పటికి ప్రమోషన్ రాలేదని స్వీపర్ ముండ్రాతి మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నా 33 సంవత్సరాల కిందట రూ. 150తో పారŠట్ట్టైం స్వీపర్‌గా పనిలో చేరిన. విద్యార్హత ఉన్నందున 1992 లో ఫుల్‌టైం స్వీపర్‌గా ప్రమోషన్ వచ్చింది. రూల్స్ ప్రకారం ఐదేళ్లకు పర్మినెంట్ చేయాలి. 25 ఏళ్లుగా ఫుల్‌టైం స్వీపర్‌గా డ్యూటీ చేస్తున్నా పర్మినెంట్ కాలేదు. ఈ విషయంపై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. నాకు ఉద్యోగం పర్మినెంట్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా నేటి వరకు అమలుకు నోచుకోలేదు. – ముండ్రాతి మల్లయ్య, పాలమాకుల ఆరు నెలలుగా జీతాలు లేవు ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చిందని సంతోషపడ్డా. 25 ఏళ్లుగా ఖాత గ్రామంలో పార్ట్ టైం స్వీపర్‌గా పని చేస్తున్నా ఉద్యోగం పర్మినెంట్ కావడం లేదు. అంగవైకల్యంతో ఇతర పనులు చేయలేక కుటుంబాన్ని పోషించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ప్రతీ నెల జీతాలు సరిగా ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆరు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నాం. – కట్కూరి యాదగిరి, ఖాతా -
భలేగా చేశారే..!
సాక్షి, హైదరాబాద్: సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల, పాఠశాలలో విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లే ముఖ్య అతిథులయ్యారు. ఈ అరుదైన సంఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల/పాఠశాలలో జరిగింది. ఇక్కడ చదివే పది, ఇంటర్మీడియట్ విద్యార్థినుల వీడ్కోలు వేడుక శనివారం రాత్రి నిర్వహించారు. దీనికి గతానికి భిన్నంగా పాఠశాలలో స్వీపర్లు నరసింహ, రాజును ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. సాంప్రదాయం ప్రకారం ప్రధాన గేటు వద్ద అతిథులకు ప్రిన్సిపల్ ప్రమోద పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించారు. విద్యార్థులు గౌరవ మర్యాదలతో వేదిక వద్దకు తీసుకెళ్లి వారిని సత్కరించారు. ఈ సందర్భంగా నరసింహ, రాజు మాట్లాడుతూ.. కలలో కూడా ఇలాంటి గౌరవం దక్కుతుందని ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. -
అమ్మ గాబరా.. నాన్న హైరానా.. పిల్లల హంగామా..
పాఠశాలలు పునఃప్రారంభం - ఎప్పటిలానే స్వాగతం పలికిన సమస్యలు - స్వీపర్లుగా మారిన విద్యార్థులు - యూనిఫాం ఊసే కరువు - పూర్తిస్థాయిలో అందని పాఠ్య పుస్తకాలు - విద్యార్థుల హాజరు అంతంతే.. పిల్లలతో పాటు బారెడు పొద్దెక్కే వరకు నిద్రించే తల్లులు అలారం పెట్టుకుని మరీ నిద్ర లేస్తున్నారు. ముసుగుతన్ని పడుకున్న చిన్నారులను బలవంతంగా నిద్రలేపి పాఠశాల వేళకు సిద్ధం చేయడం కత్తి మీద సాముగా మారింది. ఇంటి నుంచి అడుగు బయట పడగానే.. తండ్రి బాధ్యత మొదలయింది. ప్రార్థన సమయానికి పిల్లలను పాఠశాలకు చేర్చాలనే ఆత్రుత కనిపించింది. ఇక పాఠశాలల వద్ద ఒకటే సందడి. అప్పుడే పాఠశాలకు వచ్చే చిన్నారుల ముఖాల్లో ఒకింత సంతోషం కనిపించినా.. చాలా మంది పిల్లల అడుగులు అయిష్టంగానే ముందుకు పడ్డాయి. తల్లిదండ్రుల ఉరుకులు పరుగులు.. ‘బుడి’ బడి అడుగుల మధ్య కొత్త విద్యా సంవత్సరం సోమవారం నుంచి ఆరంభమైంది. కర్నూలు సిటీ: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. బడి గంట మోగడంతో సందడి మొదలయింది. ఎప్పటిలానే ఈ ఏడాదయినా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయని ఆశించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉదయం 7.30 గంటల నుంచే ఇళ్లలో హడావుడి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఆ సంతోషం స్పష్టంగా కనిపించింది. ప్రయివేట్ పాఠశాలల వద్ద కూడా సందడి కనిపించినా.. కొందరు పిల్లలు మొండికేయడం, తల్లిదండ్రులు చిరుతిండ్లతో గారాభం చేసిన తీరు చుట్టుపక్క వారి ముఖాల్లో నవ్వులు పూయించింది. మొత్తంగా పాఠశాలల వద్ద జాతర వాతావరణం కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు పాఠశాలలకు చేరుకునేందుకు ఆటోలు, బస్సులు, మోటార్ సైకిళ్లను ఆశ్రయించారు. ఇకపోతే గత ఏడాది కంటే ఈ విడత 15 శాతం పెంచిన ఫీజుల మోత తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో స్వీపర్లుగా విద్యార్థులు నెలన్నరకు పైగా వేసవి సెలవుల వల్ల మూత పడ్డ ప్రభుత్వ స్కూళ్లలో గదులన్నీ దుమ్ము, ధూళితో నిండిపోయాయి. అయితే వీటిని శుభ్రం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లకు స్వీపర్లు లేకపోవడంతో విద్యార్థులే గదులను శుభ్రం చేసుకోవడం కనిపించింది. వాస్తవానికి ఆయా స్కూళ్లలో టాయిలెట్లు శుభ్రం చేసే వారితో ఈ పని చేయించాల్సి ఉన్నా.. ఆ పరిస్థితి కరువైంది. అయితే వారిని ఈ విద్యా సంవత్సరంలో కొనసాగిస్తారో, తొలగించారో తెలియని దుస్థితి నెలకొంది. దీంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులతోనే ఉపాధ్యాయులు శుభ్రం చేయించారు. మొదటి రోజే చిన్నారులతో చీపురులు పట్టించడంపై కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే.. పరిసరాల పరిశుభ్రత అంటూ సర్దిచెప్పడం గమనార్హం. సరదాలతోనే గడిచిన మొదటి రోజు పాఠశాలలు పునఃప్రారంభమైన రోజున వేసవి సెలవుల్లో ఎవరెవరు ఎక్కడ విహరించారు.. ఏమి చేశారనే దానిపై విద్యార్థులతో ఉపాధ్యాయులు ఆనందాలను పంచుకుని సరదాగా గడిపారు. మరికొంత మంది అయితే గత తరగతి నుంచి పైతరగతి వచ్చిన సందర్భంలో ఎలా చదవాలి అనే అంశంపై విద్యార్థులకు టీచర్లు తెలియజేశారు. మొదటి రోజున కచ్చితంగా ప్రతి టీచర్ స్కూల్‌కు హాజరుకావాలనే ప్రభుత్వ ఆదేశాలను అందరూ పాటించారు. బయోమెట్రిక్ హాజరు అంతంతే.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు మొదటి రోజునే మొరాయించాయి. జిల్లాలో మొత్తం 33 ఏపీ ఆదర్శ స్కూళ్లు, 335 జెడ్పీ పాఠశాలలు, 25 రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బయెమెట్రిక్ పరికరాలను పంపిణీ చేయగా.. ఇందులో 350 స్కూళ్లలో మాత్రమే కరెంట్ సరఫరా ఉండడంతో ఏర్పాటు చేశారు. మొదటి రోజున ఉదయం 36.44 శాతం మంది టీచర్లు ఈ–హాజరు వేశారు. స్కూల్ ముగిసే సమయంలో 21.66 శాతం ఈ–హాజరు నమెదయింది. విద్యార్థుల ఈ–హాజరు 0.38 శాతం మాత్రమే నమోదు కావడం చూస్తే బయెమెట్రిక్ పని తీరు ఇట్టే అర్థమవుతుంది. పుస్తకాలు, యూనిఫాం ఏది? ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లు పునఃప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం మొదటి రోజునే అందజేస్తామని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు హామీ ఇచ్చారు. కానీ జిల్లాలో ఒక్క స్కూల్‌కు కూడా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందకపోవడం గమనార్హం. జిల్లాలోని 4,282 స్కూళ్లకు చెందిన 6.41 లక్షల విద్యార్థులకు 18.23 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. 45 శాతం మాత్రమే జిల్లాకు చేరాయి. వీటిలో 73 శాతం పాఠ్యపుస్తకాలు ఆయా మండలాలకు చేర్చారు. యూనిఫాంకు ఇంత వరకు పైసా బడ్జెట్ కూడా రాలేదు. దీంతో విద్యార్థులు పాత దుస్తులు, పాత పుస్తకాలతోనే స్కూళ్లకు హాజరయ్యారు. -
రోడ్డెక్కిన ‘పారిశుద్ధ్య’ దండు..
* కూలి డబ్బుల విషయంలో రేగిన వివాదం * రూ.400 కు రూ.300 చేతిలో పెట్టిన అధికారులు * కలెక్టర్ కల్పించుకోవడంతో సమస్యకు తెర అమరావతి : అమరావతి, ధరణికోటలలో కృష్ణా పుష్కరాల 12 రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేసిన వినుకొండ పరిసర గ్రామాలకు చెందిన కార్మికులు కూలీ డబ్బుల వివాదంతో బుధవారం స్థానిక మెయిన్ రోడ్డుపై ధర్నాకు దిగారు. వివరాల్లోకెళ్తే.. పుష్కరాల్లో పారిశుద్ధ పనులు చేయటానికి వినుకొండకు జి. భాస్కర్ అనే మేస్త్రీ ఆధ్వర్యంలో పరిసర ప్రాంత గ్రామాలకు చెందిన సుమారు 140 మంది కార్మికులు అమరావతికి వచ్చారు. మేస్త్రీ భాస్కర్ రోజుకు రూ.400 కూలి ఇస్తారని చెప్పి కూలీలను తీసుకురాగా 12 రోజులు పని చేశాక ప్రభుత్వ విధానాల ప్రకారం రూ.300 మాత్రమే ఇస్తామని అధికారులు చెప్పటంతో వివాదం మొదలైంది. దీన్ని వ్యతిరేకించిన కార్మికులు మెయిన్ రోడ్డుపై రాకపోకలను నిలిపేస్తూ అడ్డుగా కూర్చొని ధర్నాకు దిగారు. వీరికి స్థానిక సీఐటీయూ నాయకుడు సూరిబాబు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం మండల అధ్యక్షుడు షేక్ హష్మీ మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో ఎస్ఐ వెంకట ప్రసాద్ వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడి కార్మికులకు కూలి డబ్బులు చెల్లించాలని కోరారు. దీంతో గ్రామ సర్పంచి గుడిశె నిర్మలాదేవి, పంచాయతీ కార్యదర్శి మోహన్‌చంద్, ఇతర అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడి కూలీలకు డబ్బులు చెల్లించటానికి ఒప్పించారు. ఈలోపు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కూలీలకు రూ.400 చొప్పున కూలి చెల్లించాలని అదేశించటంతో అమరావతి గ్రామ సర్పంచి తన సొంత నిధులను చెల్లించటంతో వివాదం సమసింది. -
స్వీపర్లు కావలెను
బ్రాహ్మణ, క్షత్రియులకు ప్రాధాన్యం అహ్మదాబాద్: స్వీపర్లు కావాలంటూ స్థానిక సెయింట్ జేవియర్స్ ఆధ్వర్యంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఇచ్చిన ప్రకటన వివాదాస్పదమైంది. సెయింట్ జేవియర్స్కు చెందిన ఎన్జీఓ ‘హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ సెంటర్’ (హెడీఆర్సీ) డెరైక్టర్ ప్రసాద్ చాకో స్వీపర్లు తదితర పారిశద్ధ్య సిబ్బంది పోస్టుల కోసం ఏప్రిల్‌లో ప్రకటన ఇచ్చారు. అందులోని ఓ క్లాజ్‌లో... బ్రాహ్మణ, క్షత్రియ, వనియా, పటేల్, జైన్, సయ్యద్, పఠాన్, సిరియన్ క్రిస్టియన్, పార్సి కులస్తులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై గత రెండు రోజులుగా ఎన్జీఓ కార్యాలయ ప్రాంగణంలో ఆందోళనలు జరుగుతున్నాయి. రాజ్‌పుత్ శౌర్య ఫౌండేషన్, యువ శక్తి సంఘటన్, సున్ని అవమి ఫోరమ్‌కు చెందిన కొందరు ఎన్జీఓ ప్రకటనను తప్పు పట్టారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కలెక్టర్‌కు విన్నవించారు. అయితే ఎన్జీఓతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థల బృందం కలెక్టర్‌ను కలిసింది. తామే కులాన్నీ కించపరిచే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇవ్వలేదని తెలిపింది. -
వారానికో పీహెచ్సీ సందర్శన
జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆకస్మిక తనిఖీలు సబ్బవరం తహసీల్దార్‌పై ఆగ్రహం సబ్బవరం: జిల్లాలోని పీహెచ్‌సీలను ఒక గాడిన పెట్టేందుకు జిల్లా కలెక్టర్ ఎన్. యువరాజ్ నడుం బిగించారు. ప్రతి వారం ఒక పీహెచ్‌సీని సందర్శించేందుకు నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మండలంలోని గుళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శించారు. పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన ఆస్పత్రిలో సమస్యలను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్, స్వీపర్లు, అటెండర్లు అవసరమని పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ సుజాత కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసి తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులతో రేషన్ కార్డులు అనుసంధానం, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఆన్లైన్ ఎలా జరుగుతోందని ఆర్ఐని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ యువరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాలో వైద్య నిపుణులు కొరత ఉందని ఈ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 2866 మంది బడికి రాని బడిఈడు పిల్లలను గుర్తించామన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సర్వే నెంబరు 255లో ఆక్రమణకు గురయిన ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎమ్. నాగభూషణరావు, ఎంపీడీఓ ఎస్. త్రినాథరావు, ఆర్ఐలు అరుణ్‌కుమార్, రమేష్ ఉన్నారు. -
ఎన్నాళ్లీ వెతలు
ఎదుగూ బొదుగూ లేని పారిశుధ్య కార్మికులు దారిద్య్రం తాండవిస్తున్నా కనికరింపు లేదు కాంట్రాక్టు సంగతి సరే... కనీసం పర్మినెంట్ వారికీ దిక్కులేదు మహిళా కార్మికుల అవస్థలు మరింత వర్ణనాతీతం ఊరు నిద్ర లేవకముందే...తట్టా, చీపురు చేతపట్టి వీధుల్లోకొచ్చి వెలుగు రేఖలు విచ్చుకునే సరికల్లా అడుగడుగూ శుభ్రపరిచే పారిశుధ్య కార్మికుల జీవితాలు దుర్భరంగా ఉంటున్నాయి. మహిళా కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఒక వారం రోజులపాటు వారంతా విధులకు స్వస్తి చెప్తే తెలుస్తుంది వారి ప్రాధాన్యత ఎంతో. నగరపాలక సంస్థ, నగర పంచాయతీలు, పంచాయతీలు ఏవైనా సరే పారిశుధ్య కార్మికులు అత్యంత అవసరం. జిల్లాలోని మహిళా పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ‘న్యూస్‌లైన్’ బృందం సోమవారం పరిశీలించగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. - న్యూస్‌లైన్, ఒంగోలు ఒంగోలు నగరంతో పాటు, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీలు, అద్దంకి, గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి నగర పంచాయతీలు, 55 మేజర్ పంచాయతీలు, మరికొన్ని మైనర్ పంచాయతీల్లోనూ పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక్కో రకంగా జీతాలు చెల్లిస్తున్నారు. పొన్నలూరులో నెలకు రూ.3 వేలు, సింగరాయకొండలో రూ.5,100, టంగుటూరులో రూ.6 వేలు ఇలా..ఇష్టారీతిగా జీతాలిస్తున్నారు. నగర పాలక, పురపాలక సంఘాల్లో ఉన్నవారిలో దాదాపు 70 శాతం మంది కాంట్రాక్టు కార్మికులుండగా అందులోనూ 40 శాతం మంది మహిళా కార్మికులు కావడంతో వారి సంక్షేమం తమకు పట్టదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా ఏడాదికి రెండు జతల యూనిఫాంలు, కొబ్బరినూనె, సబ్బులు, 2 జతల చెప్పులు ఇవ్వాలి. అయితే ఒంగోలు, చీరాల మినహా ఎక్కడా 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి పంపిణీ చేయలేదు. పారిశుధ్య కార్మికుల చేతులకు గ్లౌజులు కూడా పంపిణీ చేయడం లేదు. ఒంగోలు, చీరాల వంటి చోట్ల అర్ధరాత్రిళ్లు సైతం వారిని విధులకు పిలుస్తున్నారు. ఆ సమయంలో వారి అవస్థలు వర్ణనాతీతం. రాత్రిపూట, వేకువజామున రద్దీ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులకు రేడియం జాకెట్లు పంపిణీ చేయాలి. ఒంగోలులోనే కొందరికి లేవు. మున్సిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు కనీసం తట్టలు, బుట్టలు సైతం లేకపోవడం గమనార్హం. దుస్తులు, చెప్పులు, బూట్లు పర్మినెంట్ కార్మికులకు ఇస్తుండగా కాంట్రాక్టు కార్మికులకు అవీ లేవు. జీతాల విషయంలోనూ తేడాలు చూపుతున్నారు. కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.6,750 ఇస్తున్నారు. అయితే వాటిలో ఈఎస్సై, పీఎఫ్ కట్ చేస్తుండటంతో చేతికొచ్చేది రూ.5 వేలు మాత్రమే. అది కూడా చాలా చోట్ల సక్రమంగా ఇవ్వడం లేదు. టంగుటూరు పంచాయతీలో 5 నెలల జీతం పెండింగ్‌లో ఉండిపోయింది. ఒంగోలు నగరపాలక సంస్థలో పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పారిశుధ్య కార్మికులకు రెండు నెలల జీతాలు ఆగిపోయాయి. అందని వైద్యసేవలు: నిత్యం దుమ్ముధూళిలో, అపరిశుభ్రత నడుమ పనిచేసే పారిశుధ్య కార్మికులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారికి కనీసం వైద్యసేవలు అందడం లేదు. జిల్లాలో ఈఎస్సై ఆస్పత్రి లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈఎస్సై సేవలు పొందేందుకు ప్రతినెలా జీతంలో కోత పడుతున్నా ప్రైవేటు, ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయించక తప్పడం లేదు. తమకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని మహిళా పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పారిశుధ్య కార్మికులను పెంచాలని కోరుతున్నారు. ఇక పంచాయతీ ఉద్యోగులకు కూడా 010 హెడ్ కింద జీతాలు వారి అకౌంట్లో పడకపోవడం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.8750 ఇవ్వాలని జీవో ఉన్నా ప్రభుత్వమే అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈఎస్సై ఆస్పత్రి అవసరం : ధనలక్ష్మి, ఒంగోలు ఈఎస్సై పేరుతో ప్రతినెలా జీతాల నుంచి కోతపడుతోంది. కానీ విజయవాడలాంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందాలంటే కుదిరేపనికాదు. ఒంగోలులో ఈఎస్సై ఆస్పత్రిని ప్రభుత్వం మంజూరు చేయాలి. అప్పటి వరకు కనీసం చిన్న డిస్పెన్సరీని అయినా ఏర్పాటు చేయాలి. అలా చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది. మా గురించి ఎవ్వరూ ఆలోచించడం లేదు పోట్లూరి సుబ్బులు, వలపర్ల. పారిశుధ్య కార్మికుల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పని ఎక్కువగా ఉంటుంది. వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. నెలకు రూ.100 నుంచి పనిచేశాను: మేకల అంజమ్మ, తాళ్లూరు 30 ఏళ్ల నుంచి తాళ్లూరు పంచాయతీలో రోడ్డు చిమ్ముతున్నారు. నెలకు వంద రూపాయల నుంచి పనిచేశాను. ప్రస్తుతం వెయ్యి రూపాయలిస్తున్నారు. ఉదయం మూడు గంటలకు రోడ్లు చిమ్ముతాను. మళ్లీ 9 గంటల నుంచి ఆఫీస్ పనిచేస్తాను. అందుకుగాను రూ.500 ఇస్తారు. అరకొర జీతంతో అవస్థ పడుతున్నా. నాలుగు నెలల జీతాలు రావాలి : మంచాల అంకాళమ్మ, యర్రగొండపాలెం మాకు నాలుగు నెలల జీతాలు రావాలి. జీతాలు రాక పోవడంతో కిరాణా కొట్లో అప్పు కూడా ఇవ్వమంటున్నారు. రోజు కూలీ పైనే ఆధారపడి ఉన్నాం. మా జీతాలు సక్రమంగా వచ్చేలా చూడాలి.