ఘాట్లలో ఈతగాళ్లను నియమించాలి
Published Sat, Jul 30 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
రావులపాలెం:
గోదావరి అంత్య పుష్కరాలకు ఏవిధమై నిధులు కేటాయించకుండా చేతులు ఎత్తేసిన ప్రభుత్వం కనీసం స్నానాలకు వచ్చే భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు ఘాట్లలో ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఏ నదికీ లేని విధంగా ఒక్క గోదావరికి మాత్రమే అంత్య పుష్కరాలు ఉన్నాయని, వాటి నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉన్నందున స్నానాలకు దిగే భక్తులు నీట మునిగే ప్రమాదం పొంచి ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో 31 ఘాట్లు ఉన్నాయని, వీటిలో ఆలమూరు మండలం బడుగువానిలంక, జొన్నాడ, కొత్తపేట మండలం సూర్యగుండాలరేవు, రావులపాలెం, గోపాలపురం ఘాట్లలో ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ ఘాట్ల వద్ద రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరారు. గత పుష్కరాల్లో ఘాట్లలో ఉన్న ఈతగాళ్లు(మత్స్యకారుల)కు నేటికీ కూలీ డబ్బులు ఇవ్వలేదన్నారు. అందుకే అంత్య పుష్కరాల్లో వారిని నియమిస్తే ఆ డబ్బులు అడుగుతారని భయపడుతున్నారన్నారు.
Advertisement