ఊపిరి తీసిన ఈత సరదా
ఊపిరి తీసిన ఈత సరదా
Published Fri, Feb 3 2017 12:00 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
- నీటి కుంటలో విద్యార్థి మృతి
- పగిడ్యాలలో ఘటన
పగిడ్యాల: రోజూ ఒకటే రకం ఆట ఎందుకనుకున్నారో ఏమో తెలియదు కానీ బుధవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికొచ్చిన తర్వాత పిల్లలందరూ కలిసి గ్రామ సమీపంలోని నీటి కుంటకు ఈతకు వెళ్లారు. అయితే నీటిలోకి దిగిన వారిలో ఒక బాలున్ని కుంట మింగేసింది. బాధిత తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘటన మండల కేంద్రమైన పగిడ్యాలలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రవికి కుమార్తెతోపాటు కుమారుడు శివకుమార్(8) సంతానం. స్థానిక శారద విద్యామందిర్‌లో ఒకటో తరగతి చదువుతున్న బాలుడు బుధవారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తోటి పిల్లలతో కలిసి స్థానిక కొణిదేల రస్తాలో ఉండే కుంటకు ఈతకు వెళ్లారు. బుధవారం గ్రామంలో వారపు సంత ఉండడంతో సరుకులు తెచ్చుకునేందుకు వెళ్లిన తల్లి కుమారునిపై కాస్త అశ్రద్ధ చేసింది. ఇదే వారి పాలిట శాపంగా మారింది. బాలుడు ఎంతకూ ఇంటికి రాకపోయేసరికి ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తోటి పిల్లలను విచారించగా అసలు విషయం తెలిసింది. చీకట్లోనే కుంటలో గాలించగా బాలుడు మృతదేహంగా బయటపడ్డాడు. మల్యాల ఫేజ్ -2 నాగటూరు లిఫ్ట్ నుంచి విడుదల చేసే నీరు తమ పిల్లాన్ని పొట్టన పెట్టుకుందని తల్లిదండ్రులు రోదించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. విషయంపై ముచ్చుమర్రి ఎస్‌ఐ బాలనరసింహులుతో మాట్లాడగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
Advertisement