తహసీల్దార్ సంతకం ఫోర్జరీ
-
ఏపీ జీబీ మేనేజర్ చొరవతో వెలుగులోకి
-
రైతుపై పోలీసులకు ఫిర్యాదు
-
సూత్రధారులను పట్టుకోవాలని ఎస్సైని కోరిన తహసీల్దార్
కలిగిరి : బ్యాంక్‌లో పంట రుణం పొందడానికి తహసీల్దార్ స్టాంప్‌లు, సంతకాలు ఫోర్జరీ చేసిన రైతుపై శుక్రవారం తహసీల్దార్ రవీంద్రనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ రవీంద్రనాథ్ సమాచారం మేరకు.. గంగిరెడ్డిపాళెం పంచాయతీ మార్తులవారిపాళెంకు మూలి పెంచలయ్య పట్టాదారు పాసుపుస్తకంతో పంట రుణం పొందడానికి గురువారం కలిగిరిలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌కు వెళ్లాడు. చిన్నఅన్నలూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 2680–2లో 5 ఎకరాల ప్రభుత్వ భూమికి పంట రుణం కోసం బ్యాంక్‌కు సంబంధించిన దరఖాస్తులను పూర్తి చేశాడు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో తహసీల్దార్ సంతకం తేడా ఉండటాన్ని బ్రాంచ్ మేనేజర్ ప్రదీప్ గుర్తించారు. రికార్డులు పరిశీలించి రుణం ఇస్తామని పెంచలయ్యను పంపించారు. అనంతరం తహసీల్దార్ రవీంద్రనాథ్‌కు సమాచారం అందించారు. ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన తహసీల్దార్ తన సంతకం, వీఆర్వోల సంతకంతో పాటు స్టాంప్‌లు కూడా ఫోర్జరీ చేసినట్లు నిర్ధారించారు. సంతకం, స్టాంప్‌లు ధ్రువీకరణ పత్రాలపై ఫోర్జరీకి పాల్పడిన పెంచలయ్యపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు స్టాంప్‌లు, సంతకాలు ఫోర్జరీలు చేస్తున్న సూత్రధారులను ప్రత్యేక చొరవ చూపి పట్టుకోవాలని ఎస్సై ఎస్‌కే ఖాదర్‌బాషాను తహసీల్దార్ రవీంద్రనాథ్ కోరారు.