తలలు వాల్చేస్తున్నారు | tallau valchestunnaru | Sakshi
Sakshi News home page

తలలు వాల్చేస్తున్నారు

Published Thu, Jul 21 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

తలలు వాల్చేస్తున్నారు

తలలు వాల్చేస్తున్నారు

చినకాపవరం(ఆకివీడు):  ఆకివీడు మండలం చినకాపవరం పాఠశాలలో మరికొందరు విద్యార్థులు అస్వస్థత బారినపడ్డారు. బుధవారం గంట వ్యవధిలోనే 24 మంది విద్యార్థులు తలలు వాల్చేసి కళ్లుతిరిగి పడిపోయారు. వీరిలో కొందరు కడుపునొప్పి, కళ్లమంటలు, కాళ్లు,చేతులు మెలితిరిగిపోవడంతో కుప్పకూలిపోయారు.దీంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తోటి విద్యార్థులు కలవరపడ్డారు. ఇంటి వద్ద నుంచి చెంగు చెంగున పాఠశాలకు వచ్చిన విద్యార్థులు తరగతి గదిలో కూర్చున్న కొద్దిసేపటికే ఇలా అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదే పాఠశాలలో మంగళవారం కూడా నలుగురు విద్యార్థులు అస్వస్థత బారిన పడిన విషయం తెలిసిందే. గత కొన్నిరోజులుగా రోజుకు నలుగురైదుగురు అస్వస్థతకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు చెబుతున్నారు. బుధవారం విద్యార్థులు ఎం.త్రివేణి, ఎన్‌.దుర్గాభవాని, కె.భవాని, భువనేశ్వరి, పి.రూపశ్రీ, డి.కావేరి, ఒ.పద్మ, వి.ఓంకార్‌ సత్య, సిహెచ్‌.దేవిక, పి.శిరీష, జి.లక్ష్మణసాయి,జి.రాజ్యలక్ష్మి, జి.కళతోపాటు మరో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఏడుగురిని భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, మరికొందరికి పాఠశాలలోనే బల్లలపై పడుకోబెట్టి వైద్యులు చికిత్స చేశారు. కొందరిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్లిపోయారు. పెదకాపవరం పీహెచ్‌సీ వైద్యాధికారి టి.రవికిరణ్‌రెడ్డి విద్యార్థుల ఆరోగ్యపరిస్థితిని పరిశీలించారు.
ప్రథమ చికిత్స చేశారు. 
 
ప్రత్యేక వైద్య బృందం .. చినకాపవరం హైస్కూల్లో విద్యార్థుల అస్వస్థత గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు  కలెక్టర్‌ కె.భాస్కర్‌కు వివరించారని ఏఎంసీ చైర్మన్‌ మోటుపలి ప్రసాద్‌ విలేకర్లకు తెలిపారు. గురువారం పాఠశాలకు జిల్లా నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపుతామని కలెక్టర్‌ చెప్పారని వివరించారు. 
 
విద్యార్థులకు సహకారం
అస్వస్థతకు గురైన విద్యార్థులకు పాఠశాల అభివృద్ధి కమిటీ బాసటగా నిలిచింది. విద్యార్థులకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్‌ ఆపిల్‌ జ్యూస్, పళ్ల రసాలు, మందులు అందజేసింది. కాళ్లు చేతులు వంకర్లు తిరిగిన విద్యార్థులకు జెడ్పీటిసీ సభ్యులు మన్నే లలితాదేవి, ఎంపీపీ నౌకట్ల రామారావు, ఏఎన్‌ఎంలు సపర్యలు చేశారు. అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఐఎస్‌ఎన్‌.రాజు, మర్రివాడ వెంకట్రావులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో పరీక్షలు చేయించి మందులు అందజేస్తున్నారు. 
 
అంతు చిక్కడంలేదు
  చినకాపవరం ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఎందుకు అస్వస్థతకు గురవుతున్నారన్నది విషయం అంతుచిక్కడంలేదు. ఇది వేస్సేవ్‌గల్‌ సింకోష్‌ అనే రకమైన వ్యాధిగా భావిస్తున్నాం. మానసిక వత్తిడి వల్ల ఇది వస్తుంది. న్యూరాలజిస్ట్‌ పరీక్షిస్తే బాగుంటుంది. ఇది అంత ప్రమాదకరం కాదు. ఇదొక మానసిక వ్యాధి లాంటిది.  
– టి.రవికిరణ్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యాధికారి, పెదకాపవరం.
 
లోపం ఎక్కడుందో పరిశీలించాలి
  చినకాపవరం హై స్కూల్‌ విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి కారణాలు అంతుచిక్కడంలేదు. లోపం ఎక్కడుందో పరిశీలించాలి. పాఠశాల ఆవరణ, ఆహారంలో లోపాలు లేవు. స్థానికులు సెల్‌ టవర్‌ వల్లే ఇది వస్తుందని చెబుతున్నారు. దీనిపై కూడా పరిశీలన జరపాలి. పది రోజులుగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతుంటే దీనిని నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. 
–మద్దూరి సూర్యనారాయణమూర్తి, డివైఇఓ, భీమవరం
 
భీమవరంలో చికిత్స 
భీమవరం టౌన్‌ : భీమవరం తరలించిన  కాటిక హేమలత 7వ తరగతి (చినకాపవరం), గుబ్బల రాజ్యలక్ష్మి 7వ తరగతి (చినకాపవరం), గోడి కళ 7వ తరగతి(రామయ్యగూడెం), బొడ్డిచర్ల వెంకటలక్ష్మి 6వ తరగతి(దండగర్ర), పొనమండి శిరీష 7వ తరగతి (గుమ్ములూరు), కోట భవాని 10వ తరగతి (గుమ్ములూరు), మామిడిపల్లి వరలక్ష్మి 10వ తరగతి (తరటావ)కి ఇక్కడి వైద్యులు కృష్ణ కిశోర్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. సిలైన్లు ఎక్కించారు. రెండు రోజులుగా చేరిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేశామని ల్యాబ్‌ నుంచి రిపోర్ట్‌ రావాల్సి ఉందని వారు చెప్పారు.  ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు గురయ్యారు. చినకాపవరం జెడ్పీ హైస్కూల్‌ ఉపాధ్యాయులు ఆస్పత్రి వద్ద విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు అల్పాహారాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement