తాండూరు పట్టణ ప్రధాన రహదారిపై హోటళ్లు, (అధికారుల తనిఖీల్లో పట్టుబడిన కుళ్లిన చికెన్)
Unhygienic Hotels And Roadside Foods: హోటల్ ఫుడ్ తింటున్నారా.. అయితే అంతే సంగతి.. ఫుడ్ పాయిజన్ అయి ఆస్పత్రిలో చేరాల్సిందే. ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఆహార భద్రతాప్రమాణాలను పాటించకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేసిన పదార్థాలను, రోడ్డుపై చేసిన పదార్థాలను తిని జనాలు రోగాలబారిన పడుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు కుళ్లిన, కలుషిత ఆహారాన్ని రుచికరంగా అందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. తాండూరు మున్సిపాలిటీలోని హోటళ్లు, రోడ్‌సైడ్ ఫుడ్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
సాక్షి, వికారాబాద్: జిల్లాలోనే పారిశ్రామిక పట్టణంగా పేరున్న తాండూరు మున్సిపాలిటీలో హోటళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వ్యాపార పరంగా ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి పట్టణానికి వస్తుంటారు. వచ్చిన వారు తాండూరు ప్రాంతంలోని ఏదో ఒక హోటల్‌లో కడుపు నింపుకోవాలి.
అయితే హోటల్ నిర్వాహకులు వారికి పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడంలేదంటూ విమర్శలు ఉన్నాయి. కలుషిత ఆహారం తిన్న ఎంతోమంది ఫుడ్ పాయిజన్ బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు ప్రధాన కూడళ్లలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం అందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.
గతంలో మున్సిపల్ అధికారులు హోటళ్లను తనిఖీ చేయగా కుళ్లిన పదార్థాలతో పాటు కుళ్లిపోయిన చికెన్, మటన్‌ను గుర్తించారు. అప్పట్లో పలు హోటళ్లను సీజ్ చేశారు. అలాగే రోడ్‌సైడ్ ఉండే టిఫిన్ సెంటర్‌లు, చాట్ భండార్‌లలో సైతం నాణ్యమైన పదార్థాలను అందించడం లేదనే విమర్శలున్నాయి. ( చదవండి: తవ్వకాల్లో బయటపడ్డ 4500 ఏళ్ల నాటి సూర్యదేవాలయం.. ఎక్కడంటే? )
రెండేళ్లుగా పర్యవేక్షణ కరువు
జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు జిల్లాకు ఫుడ్ సేఫ్టీ అధికారి ఉండాలి. అయితే జిల్లా ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఫుడ్ సెఫ్టీ అధికారిని నియమించలేదు. దీంతో తాండూరు పట్టణంలో మున్సిపల్ అధికారులే హోటళ్లలో తనిఖీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రెండేళ్లుగా మున్సిపల్ అధికారులు కూడా హోటళ్లను తనిఖీ చేయడం లేదు. మున్సిపాలిటీలో ఇన్‌చార్జి కమిషనర్ ఉండటంతో సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
రోగాలబారిన పడుతున్న ప్రజలు
తాండూరు ప్రాంతంలో ఉన్న హోటళ్లలో కలుషిత ఆహారం తిని ప్రతిరోజు 100 మందికి పైగా అనారోగ్యానికి గురవుతున్నారు. పట్టణంలో అధికంగా రోడ్లపైనే టిఫిన్ సెంటర్‌లు, చాట్ బంఢార్‌లను నిర్వహిస్తున్నారు. పట్టణంలో దుమ్ము, కాలుష్యం అధికంగా ఉంది. గాలిలో ఉన్న దుమ్ము మొత్తం ఆహార పదార్థాలపై పడి కలుషితం అవుతోంది.
అది తిన్నవారు ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. అధికారులు ఆహార భద్రతపై దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇప్పటికైనా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు హోటళ్లపై దాడులు చేసి నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
చదవండి: ‘అత్యాచారం చేసి.. పెళ్లి చేసుకుంటే కేసు కొట్టేయాలా?’
Comments
Please login to add a commentAdd a comment