
ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
టీఆర్‌ఎస్ సర్కార్‌కు తమ్మినేని ప్రశ్న
కోడేరు: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఏ ప్రభుత్వానికీ పుట్టగతులు ఉండవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం పస్పుల, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, సింగాయిపల్లి, కోడేరు మీదుగా కొనసాగింది. కోడేరులో ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని ప్రశ్నించారు. గిరిజను లు, దళితులకు మూడెకరాల భూమినిస్తామని, రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే మార్గంలో పయనించాలన్నారు.
కరువు ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: కరువు ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే నివారణ, సహాయ చర్యలు చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది. రైతాంగం అంతా సంతోషంగా ఉందని హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటనలు చేయడం ఆపేసి, వెంటనే ఖరీఫ్ సీజన్‌లో ఎండిపోయిన పంటల పరిశీలనకు అధికారులకు ఆదేశాలివ్వాలని ప్రభుత్వాన్ని సూచించిం ది. నష్టపోయిన పంట అంచనాలను తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని శనివారం సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. రబీ సాగు కోసం విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలన్నారు.