తనూజ కేసులో స్నేహితుడే కీలకం?
-
తనూజ మృతి కేసు
-
పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు
-
లైంగికంగా వేధించినట్టు అనుమానం?
పెందుర్తి : అనుమానాస్పదంగా మృతి చెందిన బాలిక తనూజ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనలో బాలిక స్నేహితుడి పాత్ర కీలకంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. అతడి మేనమామ(వరసకు) ప్రోద్బలంతోనే బాలికను బయటకు రప్పించినట్లు తెలిస్తోంది. ఆయనపై ప్రస్తుతం రౌడీ షీటు కూడా ఉన్నట్లు తెలిసింది. బాలిక స్నేహితుడి మేనమామ, మరో రౌడీ షీటరుతోపాటు మరో వ్యక్తి కూడా ఈ దుశ్చర్యలో పాలుపంచుకున్నట్టు సమాచారం. అయితే బాలికపై లైంగిక దాడి జరిగిందా ? లేదా ? అన్నది పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వెల్లడవుతుంది. మొత్తానికి పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసు చిక్కుముడి ఒకటి రెండు రోజుల్లో వీడే అవకాశం ఉంది.
అసలేం జరిగింది?
కృష్ణరాయపురానికి చెందిన కె.తనూజ(14) ఓ యువకుడితో స్నేహం చేయడం చూసిన తల్లిదండ్రులు గత శనివారం రాత్రి తీవ్రంగా మందలించారు. ఆ సమయంలో తనూజ ఇంటి నుంచి బయటకి వచ్చేసింది. ఇదే సమయంలో స్నేహితుడ్ని తనూజ కలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి కృష్ణరాయపురంలోని బీఆర్‌టీఎస్ రోడ్డుపక్కన ఉన్న అపార్ట్‌మెంటులోని ఒక ఫ్లాట్‌లోకి వెళ్లినట్టు వాచ్‌మెన్ పోలీసులకు వివరించాడు. అదే సమయంలో మరో ఫ్లాట్‌లో మద్యం సేవిస్తూ ఇద్దరు రౌడీ షీటర్లతో పాటు మరో వ్యక్తి ఉన్నాడు. ఆ సమయంలో బాలికతో వచ్చిన యువకుడు వారితో మాట్లాడాడు. అందరూ కలిసి బాలికను లైంగికంగా వేధించినట్లు పై వివరాల ఆధారంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే పోలీసులు ఆ యువకుడితో పాటు రౌడీషీటరైన అతని మేనమామ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వినికిడి.