
టీడీపీ కుట్రలు ఫలించలేదు
ప్రొద్దుటూరు:
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా, మంగళవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌ను అడ్డుకోలేకపోయిందని, ప్రజల స్వచ్ఛంద సహకారంతో బంద్ విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఓబులేసు తెలిపారు. బుధవారం ప్రొద్దుటూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బంద్ విజయవంతమవడాన్ని టీడీపీ మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందులో భాగంగానే పల్లె రఘునాథరెడ్డి, యనమల రామకృష్ణ చౌకబారు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నా, చంద్రబాబు సహకరించకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికీ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లుతో టీడీపీ, బీజేపీల కుటిల రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని ఆయన తెలిపారు.
తమ్ముళ్లకే పుష్కరాల పనులు
కృష్ణానది పుష్కరాల సందర్భంగా చంద్రబాబు రూ.3 వేల కోట్ల నామినేషన్ పనులను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారని ఓబులేసు విమర్శించారు. శ్రీశైలం నీటిలో ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎంవి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.