కడప కార్పొరేషన్:
నవ్యాంధ్రప్రదేశ్‌ను మద్యాం«ధ్రప్రదేశ్‌గా మారుస్తున్న టీడీపీ ప్రభుత్వం మహిళల కన్నీటిలో కొట్టుకుపోవడం ఖాయమని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో శనివారం మైదుకూరు, కమలాపురం, కడప ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పాదయాత్రలో మద్యం వల్ల నాశనమవుతున్న కుటుంబాలను, మహిళల కన్నీటిని చూశా...అధికారంలోకి వస్తే బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఆ జీవోను సవరించి బీచుల్లో, హోటళ్లు, పర్యాటక కేంద్రాల్లో బార్ లైసెన్సులు ఇస్తున్నారని మండిపడ్డారు. కుటుంబాలను ఛిద్రం చేసి మహిళల జీవితాలను చీకటిమయం చేసే ఈ నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రపంచంలో ఏది జరిగినా అది తన వల్లే అని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. ప్రభుత్వపెద్దలు తమ మూలధనాన్ని సరిచేసుకున్నాకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని ఆరోపించారు. కేంద్రంలోని కీలక నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు విదేశాల్లో పర్యటించి తన బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకున్నారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యజనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీలకు 250 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి– రఘురామిరెడ్డి
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ మీటర్లు వేసిన దాఖలాలు లేవని, ప్రస్తుత ప్రభుత్వం బలవంతంగా వారికి మీటర్లు అమర్చుతోందని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. కరెంటు బిల్లులు చెల్లించే స్థితిలో వారు లేరన్నారు. రూ.500, రూ.1000నోట్ల రద్దు విషయం వెంకయ్యనాయుడు ద్వారా సీఎంకు తెలిసి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వారు అన్నీ సర్దేసుకున్నాక సామాన్యులపై భారం వేశారని మండిపడ్డారు. సామాన్యులు, రైతులు పనులు మానుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం తాము రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోరాడుతున్నామని, పవన్ కళ్యాణ్‌తోపాటు ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామన్నారు.
మద్యం విధానాన్ని ఉద్యమంలా చేస్తున్నారు– రవీంద్రనాథ్‌రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం మద్యం విధానాన్ని ఒక ఉద్యమంలా ప్రజలపై రుద్దుతోందని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ మాట్లాడటం మంచిదేనన్నారు. ప్రధాని హోదాలో నరేంద్రమోదీ అర్థరాత్రి పెద్దనోట్ల రద్దు ప్రకటించి సామాన్యులను హింసకు గురి చేశారన్నారు. నోట్ల రద్దుకు రెండు రోజుల ముందు హెరిటేజ్‌ను రూ.290కోట్లకు అమ్మడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు.