మానవమృగం చేతిలో ఇద్దరి జీవితాలు బలి
మానవమృగం ఉదంతంలో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందు నుంచే ఆషాబీతో సన్నిహితంగా ఉంటున్న మృగం.. సొంత అక్క కూతుర్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో బలవంతంగా ఆమెను తిరుపతికి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల తరువాత పాత సంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయంగా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. చివరకు ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు.
మరోవైపు తాను నెల తప్పానని, వెంటనే పెళ్లి చేసుకోవాలని ఆషాబీ కోరగా, ఆ దుర్మార్గుడు చెయ్యి చేసుకోవడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఆ విధంగా మానవమృగం చేతిలో అమాయకులైన ఇద్దరు అమ్మాయిలు బలయ్యారు. అయితే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది.
చిత్తూరు జిల్లా గుమ్మఘట్ట మండలం బీటీ ప్రాజెక్ట్(బీటీపీ)కు చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు బెస్త రఘు ఆకృత్యాలకు అమాయకులైన ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తొలుత తన అక్క కుమార్తె కవితను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అప్పటికే అతను ఆషాబీతో సన్నిహితంగా ఉండడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అయితే పట్టువదలకుండా అక్క కుమార్తెను బలవంతంగా పిల్చుకెళ్లి తిరుపతిలో రహస్యం గా పెళ్లి చేసుకున్నాడు. ఐదు నెలలు తిరక్కనే పాత పరిచయం కొనసాగించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలిసి భార్య కవిత నిలదీసింది. అప్పటి నుంచి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. ఈ జీవితం వద్దనుకున్న కవిత పురుగుల మందు అప్పట్లో తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే బంధువులే కావడంతో సునాయసంగా ఆ కేసు నుంచి తప్పించుకోగలిగాడు.
పెళ్లి పేరుతో వంచన
తండ్రి ఆదరణ లేని ఆషాబీపై కన్నేసిన రఘు ఆమెతో చనువు పెంచుకున్నాడు. ఆ తరువాత తన మాయమాటలతో ఆమెను లొంగితీసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ ఆమెను కలిసేవాడు. ఈ నేపథ్యంలో ఆమె నెల తప్పినట్లు తెలుస్తోంది. వెంటనే తనను పెళ్లి చేసుకోవాలని ఆమె పోరుపెట్టినట్లు సమాచారం. అందుకు రఘు అంగీకరించకపోవడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె తల్లితో కలసి మేనమామ ఇంటికి వెళ్లడంతో అతను గొడవకు దిగాడు. ఆ తరువాత ఆషాబీపై చెయ్యి చేసుకోవడం, అడ్డుకోబోయిన ఆమె తల్లిపైనా దాడి చేయడంతో అవమానభారంతో ఆషాబీ ఆత్మహత్య చేసుకుంది. ఆ తరువాత తనూ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడినట్లు తెలుస్తోంది.
కేసు తారుమారుకు యత్నం
తన అన్న టీడీపీ నాయకుడు కావడంతో రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తాజా కేసు నుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం బళ్లారి ఆస్పత్రిలో చేరిన నిందితుడు రఘు అక్కడి నుంచే చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆషాబీ ఉదంతంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని మహిళ, ప్రజా సంఘాల ప్రతినిధులు బుధవారం డిమాండ్ చేశారు.