వివాదాస్పద భూమిలో నిలిపివుంచిన దుండగుల వాహనం
గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో అధికార పార్టీ ముఖ్యనేత నిర్వాకం
తనయుని దందాలకు వత్తాసు పలుకుతున్న వైనం
రూ.17 కోట్ల విలువ చేసే భూమిలో పాగా
రౌడీల దౌర్జన్యాలకు కొమ్ము కాస్తున్న పోలీసులు!
సాక్షి, హైదరాబాద్: చెప్పేవి శ్రీరంగనీతులు.. కూల్చేవి పేదల గుడి సెలు అన్న చందంగా మారింది గుంటూరు జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత వ్యవహారశైలి. అత్యంత గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఆయన అందరికీ ఆదర్శంగా నిలవాల్సిందిపోయి తనయుడు చేస్తున్న భూదందాలు, దాష్టీకాలకు వత్తాసు పలుకుతూ తన పదవికే మచ్చతెస్తున్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వీరి అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వీరి ఆగడాలను అడ్డుకోవాల్సిన పోలీసులు వారికే తొత్తులుగా మారిపోయారు. భూ ఆక్రమణలకు అండగా నిలుస్తూ బాధితుల ఆక్రందనలు పట్టించుకోవడం లేదు.
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామంలో గత నాలుగు రోజులుగా పేట రౌడీలు చేస్తున్న దౌర్జన్యకాండను నిలువరించకపోగా, వారి జోలికి ఎవరూ వెళ్ళకుండా కాపలాలు కాస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో అర్ధమవుతుంది. సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామంలో 17.30 ఎకరాల విలువైన భూమిని జిల్లా ముఖ్యనేత తనయునికి పీఏగా వ్యవహరించే ఓ వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొంటూ బాధితుడు గొడుగుల సుబ్బారావు కోర్టును ఆశ్రయించారు. సదరు భూమి సుబ్బారావు ఆధీనంలో ఉండడంతో.. తమ స్వాధీనంలోకి తీసుకునే క్రమంలో ముఖ్యనేత తనయుని ఆదేశాలతో నరసరావుపేటకు చెందిన కొందరు రౌడీలు గత శనివారం రాత్రి వివాదాస్పద భూమిలోకి చొరబడి అక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసి బోర్డులను తొలగించారు.
బాధితుని తరఫు బంధువులు రాస్తారోకోకు దిగడంతో అక్కడినుంచి వె ళ్లిపోయారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం పేటకు చెందిన రేషన్ మాఫియా ఆధ్వర్యంలో సుమారు 200 మంది రేషన్ డీలర్లు అక్కడికి వెళ్లి హల్‌చల్ చేశారు. అలా వెళ్లకపోతే మరోదఫా డీలర్‌షిప్‌లు దక్కకుండా చేస్తామని ముఖ్యనేత బెదిరించినట్టు సమాచారం. కాగా వీరు వెళ్లడానికి అరగంట ముందే బాధితుల తరఫు వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో.. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వారికి సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై బాధితుడు వైఎస్సార్‌సీపీ నేతల సహాయంతో రూరల్ ఎస్పీ నారాయణ నాయక్‌ను మంగళవారం కలసి ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండాపోయింది.
కోళ్లఫారాలు కూల్చిన పేట రౌడీలు
మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో వివాదాస్పద భూమిలోని సుబ్బారావుకు చెందిన రెండు కోళ్లఫారాలను పేట రౌడీలు పూర్తిగా కూల్చి నేలమట్టం చేశారు. షెడ్లల్లో ఉన్న రూ. 20 లక్షల విలువ చేసే పదివేల కోళ్లను ఎత్తుకు పోయారు. నరసరావుపేటకు చెందిన వ్యక్తులు అక్కడే మకాం వేసి తన మూడు ఎకరాల్లోని మొక్కజొన్న పంటను రోటావేటర్‌తో దున్ని నాశనం చేయడమే కాక కోళ్లఫారాలను కూల్చి వేశారని బాధితుడు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.
సత్తెనపల్లి సబ్‌డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులంతా వారికే వత్తాసు పలుకుతూ వివాదాస్పద భూమికి సమీపంలోనే తిరుగుతూ అటువైపు ఎవరూ రాకుండా కాపాలా కాస్తున్నారని బాధితుడు వాపోయారు. తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర స్థాయి పోలీసు అధికారులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వివాదాస్పద భూమి ఆక్రమణ విషయంలో పోలీసుల పాత్రపై విచారణ జరుపుతున్నామని, వారి ప్రమేయం ఉన్నట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ చెప్పారు.