
దౌర్జన్య కాండ
టీడీపీ కార్యకర్తలు, నాయకుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
► ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియలో చెలరేగిపోయిన టీడీపీ నాయకులు
► కలెక్టరేట్ చుట్టుపక్కల మోహరింపు
► అటువైపు వచ్చినవారిపై దాడులు
► పెద్దమండ్యం ఎంపీపీ కిడ్నాప్
► వెదురుకుప్పం జెడ్పీటీసీ సభ్యుడిపై దాడికి యత్నం
టీడీపీ కార్యకర్తలు, నాయకుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మంగళవారం కలెక్టరేట్‌లో నామినేషన్లు వేయడానికి వచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. చేతిలో కొన్ని కాగితాలు.. సంచి.. ఉంటే చాలు. ఎవరు..?.. ఎక్కడ అని ఆలోచించలేదు. దొరికిన వారిని.. దొరికినట్టుగా ఎత్తుకెళ్లి చితకబాదేశారు. తమకు లోబడని వారిని కిడ్నాప్ చేసేందుకూ వెనుకాడ లేదు. అరుపులు..ఈలలు వేస్తూ హంగామా సృష్టించారు. ఎవర్నీ నామినేషన్లు వేయనీయకుండా భయభ్రాంతులకు గురిచేశారు. ఇంతజరుగుతున్నా పోలీసులు ఏ ఒక్క కార్యకర్తనూ అడ్డుకోకపోవడం గమనార్హం.
చిత్తూరు, సాక్షి : జిల్లాలో అధికార పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియలో పలువురు కార్యకర్తలు రౌడీలులాగా వ్యవహరించారు. నామినేషన్లు వేయడానికి వచ్చినవారిపై దాడులకు తెగబడ్డారు. కొందరిని కిడ్నాప్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ వేయాలంటే దొంగచాటుగా వచ్చే పరిస్థితి నెలకొంది. నామినేషన్ వేసి బయటికి వెళ్లాలన్నా భయమే.
నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులను టీడీపీ కార్యకర్తలు భయభ్రాంతులకు గురిచేశారు. మంగళవారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన పెద్దమండ్యం ఎంపీపీ ప్రసాద్‌రెడ్డిని బలవంతంగా కలెక్టరేట్ నుంచి తీసుకెళ్లిపోయారు. పీలేరుకు చెందిన భానుప్రకాష్ నామినేషన్ పత్రాలను కలెక్టర్ చాంబర్ దగ్గరలోనే చింపేశారు. ఆయన నామినేషన్ వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. పీలేరుకు చెందిన వెంకటరమణారెడ్డి అనుచరులను కలెక్టరేట్‌లోని డి–సెక్షన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లి భయపెట్టారు. కళ్లెదుటే అన్నీ జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. నామినేషన్ వేసి వెళుతున్న వెదురుకుప్పం జెడ్పీటీసీ మాధవరావును నేండ్రగుంట వద్ద టీడీపీ నాయకులు దాడిచేసి కిడ్నాప్ చేశారని తెలిసింది.
సామాన్యులపైనా దాడులు..
అధికార దర్పంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సామాన్యులపైనా దాడులకు తెగబడ్డారు. కొన్ని కాగితాలు, చేతిలో సంచి ఉంటే చాలు. చెలరేగిపోయారు. వారిపై విక్షణా రహితంగా దౌర్జన్యం చేశారు. పీలేరు నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులను కలిసేందుకు వచ్చిన డీలరు గౌరయ్యపై దాడులకు దిగారు. చేతిలో ఉన్న సంచిని లాక్కెళ్లి అందులో ఉన్న ఈపాస్ మిషన్‌ను పగులగొట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమావేశం ఉండడంతో కరీముల్లా అనే వ్యక్తి కలెక్టరేట్‌కు వచ్చారు. అతని చేతిలో కాగితాలు ఉండడంతో నామినేషన్ పత్రాలు అని ఊహించి టీడీపీ నాయకులు వాటిని చింపేశారు. విద్యార్హత పత్రాలూ తీసుకెళ్లారు. కరిముల్లా కన్నీరుమున్నీరయ్యారు.