తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
వరికుంటపాడు టీడీపీ మండల సమావేశం రసాభాస
వరికుంటపాడు : వరికుంటపాడులో జరిగిన టీడీపీ మండల సమావేశంలో తెలుగుతమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకునేంతవరకు వెళ్లారు. గత కొన్ని నెలలనుంచి నేతలమధ్య నివురుగప్పిన నిప్పులావున్న అసంతృప్తి మండల సమావేశంలో ఒక్కసారిగా బద్ధలైంది.
మండల టీడీపీ కన్వీనరు చండ్రా వెంకయ్య అధ్యక్షతన సమావేశం జరుగుతున్న సమయంలో పెద్దిరెడ్డిపల్లి టీడీపీ నాయకుడు సిద్దయ్య పెద్దిరెడ్డిపల్లి ప్రాజెక్టు నష్టపరిహార పంపిణీలో చోటుచేసుకున్న అవినీతిని ప్రస్తావించారు. కొంతమంది వైఎస్సార్‌సీపీ నాయకులే ఈ అవినీతికి పాల్పడ్డారని చెప్పబోతుండగా మరికొంతమంది టీడీపీ నాయకులే ఈ భారీ అవినీతికి పాల్పడ్డారని ఎదురుదాడికి దిగారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య తూర్పురొంపిదొడ్లకు చెందిన మండల తెలుగుయువత నాయకుడు మల్లంపాటి వెంగయ్య, చండ్రా వెంకయ్యనుద్ధేశించి మా గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత రమణయ్యకు మద్ధతుగా ఎలా నిలుస్తున్నారని నిలదీశారు.
తానేమీ మద్ధతుగా లేనని ఆయన చెప్పినా వినిపించుకోకపోవడంతో గొడవ పెద్దదైంది. ఒకరినొకరు నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. ఈ నేపథ్యంలో మండలంలోని టీడీపీ నేతలు ఎవరి మద్దతుదారులు వారికి మద్దతుగా మాట్లాడటంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ముందస్తు ప్రణాళికతోనే ఈ గొడవ జరిగిందని కొంతమంది టీడీపీ నేతలే చర్చించుకోవడం కనిపించింది. కొంతమంది నేతలు ఇరువురికీ సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సమావేశంలో ఎంపీపీ సుంకర వెంకటాద్రి, వరికుంటపాడు ప్రాథమిక వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ కాకి ప్రసాద్, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌యాదవ్, పోకా మహేష్ పాల్గొన్నారు.