అధికార పార్టీ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తమకు అడ్డొస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదనే సంకేతాలిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు లోను చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో సోమవారం ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడి అనుచరులు చేసిన వీరంగం చర్చనీయాంశంగా మారింది. కారుకు అడ్డొచ్చారనే చిన్న కారణంతో తండ్రీ కుమారుడిని బెల్టుతో చితకబాదడం.. కుమారుడిని వదిలిపెట్టండని తండ్రి కాళ్లావేళ్లా పడినా కనికరించకపోవడం చూస్తే.. ఆ పార్టీ ప్రజల్లోకి ఎలాంటి సందేశం పంపుతుందో అర్థమవుతోంది.
- నడి రోడ్డుపైనే తండ్రీకొడుకులపై దాడి
నంద్యాల: టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అభిరుచి మధు అనుచరులు ముగ్గురు నడిరోడ్డుపై తండ్రీకొడుకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఒక అనుచరుడు కుమారుడిని చేతులతో బంధించగా.. మరో ఇద్దరు అనుచరులు బెల్ట్‌తో, చేతులతో చితకబాదారు. తండ్రి చేతులెత్తి మొక్కినా వదల్లేదు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో విడిచిపెట్టారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నంద్యాలలోని రాజ్‌థియేటర్ జంక్షన్‌లో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
టీడీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అభిరుచి మధు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, తరచూ నంద్యాలకు వచ్చి వెళ్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆయన అనుచరులు మహానంది క్షేత్రానికి వచ్చారు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ నంద్యాలలోని మధును కలిసేందుకు బయల్దేరారు. రాజ్‌థియేటర్ జంక్షన్ వద్ద వీరు వెళ్తున్న కారుకు రుద్రవరం మండలం బి.కొట్టాలకు చెందిన తండ్రీకొడుకులు రామలింగారెడ్డి, లింగమూర్తిరెడ్డి వెళ్తున్న బైక్ అడ్డం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన మధు అనుచరులు కారులో నుంచి బయటకు వచ్చి బూతులు తిట్టడం ప్రారంభించారు.
ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. కొడుకును వదిలేయమని తండ్రి చేతులెత్తి మొక్కినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో రాజ్‌థియేటర్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి చేరుకొని సర్ది చెప్పారు. నడిరోడ్డుపై ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. మధు అనుచరుల చేతిలో దెబ్బలు తిన్న తండ్రీకొడుకులు ఎవరో తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ హరినాథరెడ్డి, వన్‌టౌన్ సీఐ ప్రతాప్‌రెడ్డి పరిశీలించారు. ఘర్షణకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు.
నాకు సంబంధం లేదు..
ఘటనతో తనకు సంబంధం లేదని, తాను అమరావతి ఫ్రీజోన్ డిమాండ్‌పై విద్యార్థి సంఘాలు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన దీక్షలో పాల్గొన్నానని అభిరుచి మధు విలేకరులకు తెలిపారు. తనను రాజకీయంగా దెబ్బ తీయడానికే ఇలాంటి దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
టీడీపీ నేత అనుచరుల అరాచకం
Published Tue, Jul 5 2016 9:04 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM
Advertisement
Advertisement