
వేదికపై డాన్సర్లతో కలసి చిందులేస్తున్న టీడీపీ నేతలు
- అశ్లీల నృత్యాలతో హల్‌చల్
- డ్యాన్సర్లతో తాగి తందనాలు
ఏలూరు: అధికారం దన్నుతో అడ్డగోలు సంపాదన.. అక్రమ వసూళ్లు తెచ్చిపెట్టిన నడమంత్రపు సిరితో హల్‌చల్ చేస్తున్న టీడీపీ నేతల్లో కొందరు ఉంగుటూరు మండలం కైకరం ప్రాంతంలో అశ్లీలనృత్యాలతో అంటకాగారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. ఉంగుటూరు, కైకరం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతల్లో కొందరు ఇటీవల విచ్చలవిడిగా ఓ పార్టీ చేసుకుందామనుకున్నారు.
అనుకున్నదే తడవుగా మందు, విందు సిద్ధం చేసుకున్నారు. ఈ రెండు ఎప్పుడూ ఉండేవే.. మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చి చెలరేగిపోదామని ఓ టీడీపీ నేత సలహా ఇచ్చాడు. అంతే తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మహిళా డ్యాన్సర్లను తీసుకొచ్చారు. కైకరంలోని ఓ అట్టల ఫ్యాక్టరీలో రాత్రి పూట రికార్డింగ్ డ్యాన్సుల మోత మోగించారు.
అశ్లీల నృత్యాలతో బరితెగించారు. బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా కేవలం ఎంపిక చేసిన ఓ 30 మంది కార్యకర్తలను మాత్రమే లోనికి అనుమతించారు. తెలుగు యువత నాయకుడి ఆధ్వర్యంలో జరిగిన ఈ మేళాకు టీడీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, మాజీ సర్పంచ్, ఓ ప్రజాప్రతినిధి సోదరుడు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాత్రి 10 గంటలకు మొదలైన మేళాను తెల్లవార్లూ కొనసాగించారు.
ఆ రోజు జరిగిన డ్యాన్సుల మేళాను చిత్రీకరించిన ఓ ఔత్సాహికుడు ఆ వీడియోను ‘సాక్షి’కి పంపించడంతో టీడీపీ నేతల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ మధ్యన ఏలూరులో టీడీపీ కార్పొరేటర్లు ‘ఆట కావాలా.. పాట కావాలా’ అంటూ చిందులేసిన వైనాన్ని జనం మరచిపోకముందే కైకరంలో ‘పచ్చ’నేతలు చేసిన అశ్లీల నృత్యాలు ఉదంతం వారి దిగజారుడు మనస్తత్వాలను బయటపెట్టాయి.