అధికారం ముందు దేవుడైనా ఆగాల్సిందే!
డి.హీరేహాళ్ (రాయదుర్గం) : అధికారం ముందు దేవుడైనా ఆగాల్సిందే.. అయ్య రాకపోతే అమాస ఆగదు అన్న చందంగా ఇక్కడ ఎమ్మెల్యే రాకపోతే రథం కదలదు అనే రీతిలో కాలవ శ్రీనివాసులు కోసం దాదాపు గంట సేపు రథాన్ని రోడ్డులో ఆపేసిన సంఘటన డి.హీరేహాళ్ మండలం కల్యంలో జరిగింది. కల్యంలో ప్రతి ఏటా రథ సప్తమి సందర్భంగా ఆంజనేయస్వామి రథోత్సవం నిర్వహిస్తారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు స్వామివారి ఊరేగింపు నిర్వహించాల్సి ఉంది.
భక్తులు రథాన్ని పాదగట్ట వరకు లాగారు. రథానికి అక్కడ పూజ చేసి తిరిగి ఆలయానికి తీసుకురావాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు రాలేదని రోడ్డుపైనే ఆపేశారు. చీకటి పడుతున్నా రథం తిరిగి రాకపోవడంతో వీధుల్లో ఎదురుచూస్తున్న భక్తులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వచ్చాక గంట ఆలస్యంగా రథాన్ని తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు.