
ఎల్లో ఎమ్మెల్యే.. ఎన్ని దందాలో..
♦ కాల్‌మనీ ముఠాతో సన్నిహిత సంబంధాలు
♦ వాళ్ల కార్యాలయాల్లో సెటిల్‌మెంట్లు
♦ బినామీలతో ఇసుక దందాలు
♦ బిల్డర్ల నుంచి రూ. కోటికి పైగా వసూళ్లు
♦ డిగ్రీ కోసం వేరే వ్యక్తితో పరీక్షలు రాయించినట్లు ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాల్‌మనీ వ్యాపారం పేరుతో విజయవాడ నగరంలో మహిళల చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వారితో అధికారపార్టీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నవారికి డబ్బులు ఇవ్వడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అన్ని రకాలుగా అండగా ఉన్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనను వేధిస్తున్న కాల్‌మనీ వ్యాపారులకు ఎమ్మెల్యే అండ ఉందని ఓ మహిళ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. పటమటలోని కాల్‌మనీ ఆఫీస్‌కు ఎమ్మెల్యే తరచూ వెళుతుంటారని, కొన్ని కేసులను ఆయన అక్కడే సెటిల్ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోరంకిలోని తన గెస్ట్‌హౌస్‌లో కూడా ఎమ్మెల్యే పలు సెటిల్‌మెంట్లు చేస్తుంటారని తెలిసిన వారు అంటుంటారు. సెలబ్రిటీలు వచ్చినపుడు ఎమ్మెల్యే తన అనుచరులు, సహచరులతో కలసి వారికి విందు వినోదాలు ఏర్పాటు చేస్తుంటారని తెలుస్తోంది.
బినామీలతో ఇసుక దందా
పెనమలూరు మండలం పెద్దపులిపాక ఇసుక క్వారీల్లో ఎమ్మెల్యే పలువురు బినామీలను ఏర్పాటుచేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అలా ఇసుక దందాలో వచ్చిన డబ్బునే ఆయన కాల్‌మనీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేవాడని వినిపిస్తోంది. గతంలో డీఆర్‌డీఏ అధికారులు నాలుగున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను క్వారీ నుంచి తీసేందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో డీఆర్‌డీఏ సిబ్బంది నామమాత్రం. వారు కేవలం కంప్యూటర్ ఆపరేటర్లుగా మాత్రమే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ అనుచరులే నేరుగా టిప్పర్లకు పొక్లెయిన్‌ల ద్వారా ఇసుకను నింపేవారు. ప్రభుత్వం అప్పట్లో క్యూబిక్ మీటరు ఇసుకను టిప్పర్లోకి నింపినందుకు రూ.50 చొప్పున ఇచ్చేందుకు అనుమతిచ్చింది. ఈ విధంగా లెక్క వేస్తే నాలుగున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను టిప్పర్లలో నింపడం ద్వారా ఎమ్మెల్యే బినామీల అకౌంట్లకు కోట్లాది రూపాయాలు జమ అయ్యాయి. ఇప్పటికీ ఈ క్వారీలో డీఆర్‌డీఏ వారు, ఎమ్మెల్యే అనుచరులే ఇసుకను లారీలు, టిప్పర్లలోకి నింపుతున్నారు. ఇలా 2.25 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుకను తోడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఇసుక తరలిస్తే బినామీల అకౌంట్లలోకి మరిన్ని కోట్లు జమ అవుతాయి.
బిల్డర్ల నుంచి కోటికిపైగా..
యనమలకుదురులో పంచాయతీ అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన బిల్డర్ల వద్ద నుంచి ఎమ్మెల్యే దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అదంతా దుష్ర్పచారం అని ఖండిస్తూనే తాను ఏమి చేసినా గ్రామాభివృద్ధి కోసమేనని, అభివృద్ధి ఫండ్ కింద వారు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే తప్పేమిటని ఎమ్మెల్యే పంచాయతీ పెద్దలను ప్రశ్నిస్తుంటారట.
డిగ్రీ పరీక్షలోనూ నకిలీ...
గత ఏడాది దూరవిద్య ద్వారా డిగ్రీ పొందేందుకు మరో వ్యక్తితో ఎమ్మెల్యే పరీక్ష రాయించిన విషయం మీడియాలో వచ్చింది. రెండు రోజుల పాటు అజ్ఞాత వ్యక్తి పరీక్ష రాసిన తరువాత మూడోరోజు మీడియా వారు గుర్తించి పట్టుకున్నారు. అయితే కాలేజీ వారు ఆ వ్యక్తిని కాలేజీ నుంచి దాటించారు. కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానంలో కూర్చొని పరీక్ష రాసిన వ్యక్తి ఫొటోలతో కథనాలు వచ్చాయి. ఎమ్మెల్యే పెనమలూరు జిల్లా పరిషత్ హైస్కూలులో 10వ తరగతి చదివారు. కర్ణాటకలో పాలిటెక్నిక్ మధ్యలో వదిలేశారని సమాచారం.
ఆస్తులు-వ్యాపారాలు
పోరంకిలో రెండు సినిమా హాళ్లు
ఇబ్రహీంపట్నం దొనబండలో క్రషర్
పోరంకిలో 2 ఎకరాల విలువైన భూమి (రూ.20 కోట్లు)
పోరంకిలో అతిథి గృహం, ఇల్లు ఉన్నాయి.
వైష్ణవి కన్‌స్ట్రక్షన్స్ (బిల్డర్). ప్రస్తుతం పోరంకిలో అపార్టుమెంట్ నిర్మాణం చేస్తున్నాడు.
గతంలో ప్రైవేటు బస్సులు, లారీలు ఉండేవి.
రాజకీయ నేపథ్యం
2001లో పోరంకి సర్పంచిగా పోటీచేసి పరాజయం
2006లో పోరంకి వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచిగా పని చేశారు.
ఇప్పుడు పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు.
టీడీపీలో పదవులు
యలమంచిలి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు.
టీడీపీ పోరంకి గ్రామ అధ్యక్షుడిగా పనిచేశారు.
టీడీపీ పెనమలూరు మండల అధ్యక్షుడిగా పనిచేశారు.