నన్నే టచ్‌ చేస్తారా.. మీసంగతి చూస్తా! | tdp mla violation of the rules freely | Sakshi
Sakshi News home page

నన్నే టచ్‌ చేస్తారా.. మీసంగతి చూస్తా!

Published Fri, Mar 10 2017 2:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నన్నే టచ్‌ చేస్తారా.. మీసంగతి చూస్తా! - Sakshi

నన్నే టచ్‌ చేస్తారా.. మీసంగతి చూస్తా!

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి వీరంగం
నాకే రూల్స్‌ చెబుతారా.. అంటూ రుబాబు
ఉదయం ఏవీఎన్‌ కాలేజీ వద్ద.. సాయంత్రం ప్రేమ సమాజం వద్ద..
యధేచ్ఛగా నిబంధనల అతిక్రమణ
అడ్డొచ్చిన పోలీసు అధికారులపై ఆగ్రహం


నిరంతరం వివాదాల్లో ఉండటం ఆయన శైలి.. ఎమ్మెల్సీ పోలింగ్‌ సందర్భంలోనూ తప్పలేదు ఆ లొల్లి.. దీనికి కేంద్ర బిందువు ఎమ్మెల్యే వాసుపల్లి.. తాజాగా పోలింగ్‌ కేంద్రం వద్ద నిబంధనలు అతిక్రమిస్తున్న టీడీపీ–బీజేపీ కార్యకర్తలను నియంత్రించడానికి యత్నించిన పోలీసులపై రుబాబు చూపారు.. ‘నన్నే టచ్‌ చేస్తారా.. మీసంగతి చూస్తా’.. అని హెచ్చరించారు... సదరు వాసపల్లిగారే మరో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లబోగా అడ్డుకున్న అక్కడున్న పోలీసు అధికారులతోనూ వాగ్యుద్ధానికి దిగారు. పరుష పదజాలంతో రెచ్చిపోయారు.


విశాఖపట్నం : వివాదాస్పద శైలితో అధికార దర్పం చూపించే విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పోలీసులపై తన ప్రతాపం చూపించారు. అ కారణంగా వారిపై  విరుచుకు పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు సర్దిచెప్పే యత్నం చేసిన ఎస్సైలపై  వీరంగం వేశారు.   ఏవీఎన్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉదయం 9 గంటల సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమిగూడి ఉండటంతో పాటు ఎన్నికల నియమావళికి విరుద్ధఃగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్‌ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో ఉండాల్సినవారు పోలింగ్‌ కేంద్రానికి దగ్గరగా కుర్చీలు వేసుకుని కూర్చోవడం, ఇద్దరికి బదులు ఐదారుగురు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి దూరంగా వెళ్లమని సూచించారు.

ఇందుకు ససేమిరా అన్న కార్యకర్తలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ఫోన్‌ చేశారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న వాసుపల్లి.. వచ్చీ రావడంతోనే అక్కడున్న పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలోనే ఎస్సై సురేష్‌ ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ‘సర్‌.. మీరు పార్టీ కండువా వేసుకుని లోనికి రాకూడదు’.. అంటూ అనునయంగా నచ్చజెప్పే యత్నం చేశారు.. ఇందుకు ఎమ్మెల్యే ఆగ్రహిస్తూ.. ‘ఏం సురేష్‌ నీకు ఈ మధ్య ఎక్కువైంది.. నీ సంగతి చూస్తా’.. అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఎస్సై ఒకింత అనునుయంగా ఆయన దగ్గరకు వెళ్లి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే  యత్నం చేయగా.. ‘టచ్‌ చేసి మాట్లాడకు.. దూరంగా ఉండు’.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పక్కనే ఉన్న ఏసీపీ నరసింహమూర్తి ఎమ్మెల్యే వద్దకు వచ్చి ‘సర్‌... మీకు తెలియని రూల్సా.. ప్లీజ్‌ కో ఆపరేట్‌ చేయండి’.. అని అనడంతో ఆ గొడవ సద్దు మణిగింది

ప్రేమ సమాజంలోనూ అదే గొడవ..
సాయంత్రం 4.30 గంటలకు ప్రేమ సమాజం పోలింగ్‌ కేంద్రం వద్ద కూడా ఎమ్మెల్యే వాసుపల్లి పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు. ఆయన నేరుగా పోలింగ్‌ కేంద్రంలోనికి వెళ్తుండగా.. ఎస్సైలు మహేశ్వరరావు, లక్ష్మీనారాయణలు అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఎస్సై లక్ష్మీనారాయణను ఉద్దేశించి ‘ఏంటయ్యా  నువ్వు చెప్పేది.. నేను ఎమ్మెల్యేను లోనికి వెళ్తాను.. ఏం చేస్తావు’.. అని ప్రశ్నించారు. ఇందుకు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ బదులిస్తూ ‘మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి సార్‌.. మీకేమైనా అభ్యంతం ఉంటే ఫిర్యాదు చేసుకోండి’ అని సూటిగా సమాధానమిచ్చారు.

దీంతో ‘చేస్తాను.. చూస్తాను.. ఏం లోపలకు వెళ్లి  రాకూడదా.. వెళ్లకూడదనే రూలేమైనా ఉందా..  నేను ఎలక్షన్‌ ఆఫీసర్లతో మాట్లాడాలమ్మా.. పోలింగ్‌ స్లోగా అవుతుందని ఫిర్యాదు వచ్చింది.. అందుకే వెళ్లాలి’ అని వాసుపల్లి చెప్పుకొచ్చారు. దీనికి పోలీసులు స్పందిస్తూ.: ‘మీ ఏజెంట్‌ చూసుకుంటాడు.. 200 మీటర్ల వరకూ ఎవరూ ఉండకూడదు.. మీరు లోపల తిరుగుతున్నారు’.. అని వ్యాఖ్యానించారు. అంతే వాసుపల్లి ఆగ్రహంతో ఊగిపోతూ.. రూల్స్‌ చెబుతున్నావేంటని రెచ్చిపోయారు. ఇక్కడ జరుగుతున్నవన్నీ మేం రికార్డు చేస్తున్నాం అని పోలీసులు వ్యాఖ్యానించడంతో చివరికి వెనక్కి తగ్గిన వాసుపల్లి అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement