మాగంటి బాబుకి ఏమైంది?!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయాలంటూ ఏలూరు ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాగంటి బాబుకు మతిభ్రమించి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ మాగంటి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకమైనా టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచేవారికి, పార్టీ అభివృద్ధికి కృషి చేసేవారికి, టీడీపీ నేతలు సూచించిన వారికే దక్కాలని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్ వేర్వేరు ప్రకటనల్లో బాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాగంటికి పిచ్చిముదిరి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని వారు పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ మేలు చేయాలన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్న మాగంటి బాబును ఏమనాలో కూడా అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రజలను రాజకీయ పార్టీల వారీగా చీల్చి మాట్లాడటం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు.
హిందూమతాన్ని కించపరుస్తారా
ఒక మతానికి చెందిన సమావేశానికి వెళ్లి హిందూ మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం మాగంటి దిగజారుడు తనానికి నిదర్శనమని హిందూ ధర్మ రక్ష కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎన్‌ఎస్ సుబ్రహ్మణ్యం విమర్శించారు. సోమవారం కొయ్యలగూడెం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ మాగంటి బాబు ‘హిందూ మతంలో గంటల శబ్దం, ప్రసాదం కోసం తోపులాటలు తప్ప ఆధ్యాత్మికత ఉండదు’ అన్న ఎంపీ వ్యాఖ్యలు అభ్యంతరకరమని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ‘మాగంటి బాబు కూడా ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తుంటారు. మరి ఆయన కూడా ప్రసాదాలకే ఎగబడుతున్నారా’ అని ప్రశ్నించారు.
పోలవరం ఎమ్మెల్యే వర్గీయుల్లోనూ అసహనం
చీటికీ మాటికీ పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావును లక్ష్యంగా చేసుకుని మాగంటి విమర్శలు సంధిస్తుండటంపై టీడీపీలోనూ అసహనం వ్యక్తమవుతోంది. టీడీపీకే చెందిన శ్రీనివాస్‌ను పలచన చేస్తూ ఎంపీ వ్యాఖ్యలు చేస్తుండ టంపై పార్టీలోని దళిత, గిరిజన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొయ్యలగూడెంలో సోమవారం నాటి సభలోనూ మాగంటి మొడియంను ఉద్దేశించి ‘ఎమ్మెల్యే నా సూచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చెప్పండి. ఆయన సంగతి నే చూసుకుంటా’ అన్నారు. దీనిపై టీడీపీ వర్గాల్లో అంతర్గతంగా జోరుగా చర్చ నడుస్తోంది.