మేడమ్ పేరు చెబితే చాలు ...
- ముచ్చెమటలు పట్టిస్తున్న వైనం
- మద్యం షాపుల వ్యవహారాల్లోనూ జోక్యం
- సొంతపార్టీలో మొదలైన కుమ్ములాటలు
ఎలాంటి అధికారం లేని ఓ మహిళ నియోజకవర్గంలో అంతటా తానై వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయడం, నచ్చనివారిని బదిలీ చేయడం మొదలుకొని కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించే వరకు పరిస్థితి వచ్చింది. కొన్ని వర్గాల వ్యాపారులు, అధికార పార్టీలోని నాయకులు, కార్యకర్తలూ మేడమ్ తీరుతో విస్తుపోతున్నారు. ఆమె ఆదేశాలు సొంత పార్టీలోనే కుమ్ములాటలకు దారితీసిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చిలకలూరిపేట : గుంటూరు జిల్లాలో ఆ మేడమ్ పేరు చెబితే చాలు అధికారులు, వ్యాపారులు సైతం ఉలిక్కి పడుతున్నారు. ఉద్యోగులను రప్పించటం, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించటం , అధికారులను శాసించటం ఇదంతా మంత్రో, లేదా ఒక ప్రజా ప్రతినిధో చేస్తున్నాడంటే ఇందులో వింత ఏముందిలే అనుకోవచ్చు. కానీ ఎటువంటి అధికారం లేకుండా ఒక మహిళ నియోజవర్గంలో పవర్ పాయింట్‌గా మారడం విశేషం. పలువురిని ముచ్చెమటలు పట్టిస్తున్న మేడమ్ ఇటీవల మద్యం దుకాణాల విషయంలో దృష్టిసారించడంతో సొంత పార్టీలోనే కుమ్మలాటలు మొదలయ్యాయి.
వాటాలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు...
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లాభాలు రావటం లేదని భావించి ఇటీవలే మూసివేశారు. వీటి స్థానంలో అదే వార్డు, గ్రామ పరిధిలో తిరిగి టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులు అప్పగించారు. అప్పటినుంచి టీడీపీలో ముసలం మొదలైంది. తమ పరిధిలోకి వచ్చి ఎవరైనా వ్యాపారం చేసుకుంటే కప్పం చెల్లించాల్సిందే అన్న రాచరిక వ్యవస్థకు అద్దం పడుతూ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకుంటే టీడీపీ వారికి వాటాలు ఇవ్వాల్సిందే అని మౌఖిక అదేశాలు జారీ అయ్యాయి. ఇక్కేడే వర్గ వైరుధ్యాలు బయటపడ్డాయి. ఎవరికి వారే తామంటే తామని పోటీ పడటంతో వాటాల వద్ద విభేదాలు మొదలయ్యాయి.
మురికిపాడు షాపు వ్యవహారంలో...
ఇటీవల మండలలోని మురికిపూడి గ్రామంలో ఏర్పాటు చేసే మద్యం దుకాణం వ్యవహారంలో ఇటువంటి పరిస్థితి తలెత్తితే మంత్రి సమక్షంలో సమస్యను పరిష్కరించారు. వెనువెంటనే మరో వివాదం రాజుకుంది. పట్టణంలో మూడో వార్డు పరిధిలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని విజయవాడకు చెందిన మద్యం వ్యాపారి టెండర్ దక్కించుకున్నాడు. టీడీపీ నాయకులైన ముగ్గురికి వాటాలు ఇచ్చి నరసరావుపేట సెంటర్‌లో దుకాణం ప్రారంభించి నాలుగురోజులపాటు నడిపాడు.
ఈ విషయం తెలిసిన మేడమ్ తీవ్రస్థాయిలో మండిపడి వెనువెంటనే దుకాణాన్ని మూసివేయాలని ఎక్సైజ్ అధికారులకు అదేశించారు. టీడీపీ నాయకులు మేడమ్ నిర్ణయంపై కంగుతిని ఏకంగా ఆందోళన సిద్ధమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో వారికి వాటాలు రద్దు చేసి తమ వర్గానికి చెందిన అనుచరులకే ఇచ్చి దుకాణాన్ని తెరవాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో తెలుగుతమ్ముళ్లు ఎటూ పాలుపోక మేడమ్ తీరుపై దుమ్మత్తి పోస్తున్నారు.