అల్లుడా మజాకా !
అధికారపార్టీ ముఖ్యనేతబంధుత్వంతో పేట్రేగిపోతున్న ఓ సీఐ
యువనేత అడుగులకు మడుగులు ఒత్తుతూ అక్రమాలు
విపక్ష నేతలు, కార్యకర్తలపై అనుచిత ప్రవర్తన
దొంగల నుంచీ వాటాలు.. అక్రమార్కుల నుంచి మామూళ్లు
నరసరావుపేటకు చెందిన ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అధికార పార్టీ అండతో పేట్రేగిపోతున్నారు. ఆయన ఓకే చేస్తేనే సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో పోలీస్ అధికారులకు పోస్టింగులు దక్కేది. ఆయనకు స్టేషన్ల సరిహద్దులతో సంబంధం లేదు. ‘యువనేత’కు ఎక్కడ ‘అవసరం’ ఉంటే ఆయన అక్కడ వాలిపోయి హల్‌చల్ చేస్తుంటారు. ఆ సీఐ అధికార తెలుగుదేశంలోని ఓ ముఖ్యనేత స్వగ్రామానికి అల్లుడు, పైగా బంధువు కావడం ఇందులో కొసమెరుపు..!
గుంటూరు : ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం పట్టించుకోని ఆ సీఐ, యువనేత నుంచి ఫోన్ రావడమే ఆలస్యం అన్నట్టు నిలబడి సెల్యూట్ చేసి జీహుజూర్ అనడం ఆయన బలహీనత అని, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు కనిపిస్తే ‘పచ్చ’ చొక్కా వేసుకున్న ఖాకీల ఊగిపోవడం ఆయన నైజంగా చెపుతుంటారు. ఆయన అవినీతిని నియోజకవర్గంలో పిట్టకథల్లా చెప్పుకుంటూ ఉంటారు. అక్రమార్కుల నుంచి నెలవారీ మామూళ్లతో మొదలుపెట్టి ఆయన నడపని దందా ఉండదంటారు.
ఇటీవల నరసరావుపేటలో జరిగిన సంఘటనలకు ఆయన అనుచిత ప్రవర్తనే కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు, శాంతియుత ర్యాలీలు చేస్తున్నా ఆ సీఐ అక్కడ వాలిపోతారు. వచ్చీరావడంతోనే దుర్భాషలాడుతూ లాఠీకి పనిచెబుతుంటారు. ఆయన వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం ఉండడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
కొద్ది రోజుల కిందట అక్రమ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్టేషన్ బెయిల్ పొంది తనకు మద్దుతుగా వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా ఇంటికి వెళుతుండగా, ఆ సీఐ ఏకంగా ఎమ్మెల్యే వాహన తాళాలు లాక్కుని తీవ్ర పదజాలంతో దూషిస్తూ లాఠీలకు పనిపెట్టారు. ఎమ్మెల్యేని సైతం చొక్కాపట్టుకుని నెట్టివేశారు. ఓ కార్యకర్తను తీవ్రంగా కొట్టారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సీఐ తీరుతో సహనం కోల్పోయిన జనం ఎదురుదాడికి దిగారు. సీఐ కారణంగా ర్యాలీ రక్తసిక్తంగా మారింది.
సీఐ అవినీతి లీలలు ...
అధికార పార్టీ నేతల అండతో ఆ సీఐ అవినీతికి హద్దుపద్దూ లేకుండాపోతోంది. నరసరావుపేట పట్టణంలో రెండు నెలల క్రితం ఓ కారులో రూ. 23.40 లక్షల నగదు అపహరణకు గురైంది. కారు డ్రైవరే దొంగిలించి చిలకలూరిపేటలోని ఓ హోటల్‌కు చేరాడు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో భయంతో తాను ఉన్న అడ్రస్ చెప్పేశాడు. ఈ కేసును తానే ఛేదించినట్లు బిల్డప్ ఇచ్చిన సీఐ తనకు మూడు లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడు. చివరకు ‘యువనేత’ సిఫారసుతో లక్షతో సరిపెట్టుకున్నాడు.
మరో కేసులో.. రావిపాడుకు చెందిన ఓ విద్యార్థి ఆస్ట్రేలియాలో చదువుతూ స్వగ్రామానికి వచ్చాడు. బావమరిదితో చిన్న గొడవ కావడంతో అతడిని స్టేషన్‌కు పిలిపించి రూ. లక్ష రాబట్టినట్టు సమాచారం. పట్టణంలో గుట్కా వ్యాపారుల నుంచి యువనేతకు రూ. 2 లక్షలు, తనకు లక్ష చొప్పున నెలవారీ మామూళ్ళు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
అల్లూరివారిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని స్టేషన్‌కు పిలిచి కాల్చేస్తానంటూ బెదిరించడంతో అతను న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవహారాలన్నీ పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో రహస్య విచారణ జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇలాంటి అధికారుల వల్లే పోలీసు పరువు అభాసుపాలవుతుందని ఆ శాఖలోనే బహిరంగంగా వినపడుతోంది.