పల్లె.. నీకిది తగునా?
కొత్తచెరువు : ‘పార్టీ జెండా మోయలేదు. కనీసం సభ్యత్వం కూడా లేదు. అలాంటి వ్యక్తికి టీడీపీ మండల కన్వీనర్ పదవిని కట్టబెట్టారు. పల్లె..నీకిది తగునా?’ అంటూ తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిపాటి రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తచెరువు మండల టీడీపీ కన్వీనర్‌గా దామోదర్‌నాయుడును మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సోమవారం ప్రకటించారు. దీంతో ఆ పార్టీలో విభేదాలు తలెత్తాయి. మంగళవారం కొత్తచెరువులోని నెహ్రూకూడలిలో తెలుగుయువత జిల్లా ఉపాధ్యక్షుడు రవిచంద్ర కాళ్లకు సంకెళ్లు వేసుకుని నిరాహార దీక్షకు కూర్చున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడటమే గాక పోలీస్ కేసులు కూడా భరించామన్నారు. అటువంటి వారిని మరచి కేవలం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ విభేదాలు సృష్టిస్తున్నారని పల్లెపై మండిపడ్డారు. ఈ విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి రవిచంద్రను స్టేషన్‌కు తరలించారు. కాగా.. క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందున రవిచంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి ఓ ప్రకటనలో తెలిపారు.