‘దేశం’ పగ్గాలపై వీడని సందిగ్థం
‘దేశం’ పగ్గాలపై వీడని సందిగ్థం
Published Tue, May 16 2017 11:33 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
- ఎటూ తేల్చని ‘బాబు’
–పార్టీ పగ్గాలపై ‘నామన’వైపే మొగ్గు
- జెడ్పీ
పీఠం పై జిల్లా నేతలకే బాధ్యత
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సీఎం చంద్రబాబు కోర్టులో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాల వ్యవహారంపై సందిగ్థత ఇంకా వీడ లేదు. మంగళవారం కూడా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేకపోయారు. పార్టీ జిల్లా పగ్గాలు, జెడ్పీ చైర్మన్ ఈ రెండు పార్టీకి పీటముడిగా మారిన విషయాన్ని ‘సాక్షి’లో ‘దేశం’లో కుర్చీలాట శీర్షికన కథనం ఈ నెల 16న ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద చర్చించి ఒక కొలిక్కి తీసుకువద్దామని జిల్లా నేతలు చేసిన ప్రయత్నం ఫలించ లేదు. ఈ భేటీలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని నేతలు, ఎమ్మెల్యేలు భావించారు. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అమరావతిలో చంద్రబాబును మంగళవారం కలిశారు. సుమారు 20 నిమిషాల భేటీలో ఈ రెండు అంశాలపై ఎటూ నిర్ణయం తీసుకోలేదు.
పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబెట్టాలనే చర్చ వచ్చిన సందర్భంలో జెడ్పీ చైర్మన్ నామన పేరు ప్రస్తావనకు వచ్చిందని తెలిసింది. పార్టీ పగ్గాల విషయంలో నామన వైపే అంతా మొగ్గుచూపుతున్నారని, ఇదే విషయాన్ని తమ, తమ నియోజకవర్గ పనులపై చంద్రబాబును కలిసిన సందర్భంలో జిల్లా ఎమ్మెల్యేలు చెప్పారంటున్నారు. పార్టీ పగ్గాలు నామనకు అప్పగించే విషయంలో బాబు కూడా సానుకూలంగానే ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను చంద్రబాబు జిల్లా నేతలకే అప్పగించారు. రెండు, మూడు రోజుల్లో పార్టీ నేతలు జిల్లాలో సమావేశమై పార్టీ పగ్గాలపై తుది నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. జిల్లా స్థాయిలోనే ఆలోచించి సమన్వయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో పార్టీ పగ్గాలు నామనకు అప్పగించే విషయంలో మూడొంతులు ఖాయమైనట్టే చెబుతున్నారు. ఈ నెల 22 లోపుగానే జిల్లా స్థాయిలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. కానీ నామన పార్టీ పగ్గాల వైపు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. జిల్లా పగ్గాలకు సై అంటే జెడ్పీ పీఠం కోల్పోవాల్సి వస్తుందనే ముందుచూపుతో వెనకడుగు వేస్తున్నారు.
జెడ్పీ పీఠంపై జిల్లాలోనే తేల్చుకోండన్న బాబు
ఎటొచ్చీ నామనను జెడ్పీ చైర్మన్‌గా కొనసాగిస్తారా లేక అతని స్థానంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్‌కు అప్పగిస్తారా అనే దానిపై సీఎం సమక్షంలో ఎటువంటి చర్చ జరగలేదని తెలిసింది. ముందు జిల్లా పార్టీ పగ్గాల వరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. జెడ్పీ చైర్మన్ మార్పు విషయం ఇప్పటికిప్పుడు తేలే వ్యవహారం కాదని, దీనిని తేల్చేందుకు జిల్లా స్థాయిలోనే నేతలు సమావేశం కావాలని బాబు ఆదేశించారని సమాచారం.
Advertisement