నా చావుకు కారణం భార్య ప్రవర్తనే
కడప అర్బన్ :
కడప నగరం మరాఠీ వీధిలో నివసిస్తున్న పప్పుశెట్టి శ్రీనివాసులు (34) అనే అధ్యాపకుడు మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ఉదయం స్థానికులు కిటికీలో నుంచి చూడగా శ్రీనివాసులు ఫ్యాన్ కొక్కేనికి వేలాడుతుండటం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని తాలూకా ఎస్‌ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తమ సిబ్బందితో పరిశీలించారు. ఈ సంఘటనపై మృతుని తమ్ముడు మధుబాబు, కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.
కడప నగరంలోని వివిధ కళాశాలల్లో 10 సంవత్సరాలుగా ఫిజిక్స్ విభాగం అధ్యాపకునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పప్పుశెట్టి శ్రీనివాసులుకు, సిద్ధవటంకు చెందిన సరస్వతమ్మ కుమార్తె కామాక్షితో 2011 జూన్ 26న వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలు పొడసూపాయి. పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. ఇటీవల తాలూకా పోలీస్ స్టేషన్‌లో మృతునిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టయి రిమాండ్‌కు కూడా వెళ్లాడు. తర్వాత కొన్ని రోజుల నుంచి మృతుని భార్య, అత్త తరచూ వేధింపులకు గురి చేసేవారు.
తమతో రాజీ కావాలంటే అనేక రకాలైన ఆంక్షలను పెట్టారు. దీంతో మానసికంగా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. భర్తతో విభేదాల నేపథ్యంలో మృతుని భార్య కామాక్షి, తన పిల్లలతో కలిసి తల్లి దగ్గరే ఉంటోంది. మంగళవారం రాత్రి భార్య, అత్తతో ఇతను ఫోన్‌లో మాట్లాడాడు. తెల్లవారేసరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కాగా,మృతుని తల్లి జీవనోపాధి కోసం కువైట్‌లో ఉంటోంది.
నా చావుకు భార్య, అత్త ప్రవర్తనే కారణం
మృతుడు శ్రీనివాసులు సూసైడ్ నోట్‌లో ‘తన చావుకు భార్య కామాక్షి, అత్త ప్రవర్తనే కారణం’ అంటూ రాసి ఉంది. ఈ నోట్‌ను, సెల్ ఫోన్‌ను ఎస్‌ఐ సీజ్ చేశారు. మృతుని తమ్ముడు మధుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామాక్షి, ఆమె తల్లి సరస్వతమ్మపై ఆత్మహత్య ప్రేరేపణ క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు.