
నల్లగొండ (మునుగోడు) : ఉరేసుకుని ఉపాధ్యాయురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన తేజస్విని(33), నాగార్జునసాగర్‌కు చెందిన సునీల్ ఏడు సంవత్సరాల క్రితం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. తేజస్విని మండల కేంద్రంలోని ఆదర్శపాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా సునీల్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీరు సంస్థాన్ నారాయణపురంలోనే అద్దెకుంటున్నారు. వీరికి అద్విత అని నాలుగున్నర ఏళ్ల పాప ఉంది. అయితే తేజస్విని ఆనారోగ్యంతో బాధపడుతోందని, దంపతుల మధ్య సఖ్యత లేదని ఆరోపణలు ఉన్నాయి.
పండగకు పుట్టింటికి వెళ్లివచ్చి..
దసరా పండుగకు నల్లగొండకు వెళ్లిన వారు శుక్రవారం సంస్థాన్ నారాయణ పురానికి వచ్చారు. మంగళవారం పాఠశాలకు వెళ్లకుండా తేజస్విని సెలవు పెట్టి ఇంట్లోనే ఉంది. పాపను పాఠశాలకు పంపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏమి జరిగిందో తెలియదు కానీ సజ్జ కొక్కేనికి చున్నీతో ఉరి వేసుకుంది. పాపని తీసుకుని వచ్చిన వ్యక్తి పిలిచినా తలుపు తీయకపోయేసరికి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ మల్లేశ్వరి, ఏఎస్‌ఐ యాదవరెడ్డి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందింది. చౌటుప్పల్ రూరల్ సీఐ పార్థసారథి ఘటన స్థలాన్ని పరిశీలించారు. తేజస్విని భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment