విలువలతో కూడిన విద్యనందించాలి
నెల్లూరు(బృందావనం): విలువలతో కూడిన విద్యనందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జాయింట్‌కలెక్టర్–2 రాజ్‌కుమార్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 46 మంది ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సత్కరించారు. నగరంలోని సుబేదారుపేటలోని రోమన్ క్యాథలిక్ మిషన్ కమ్యూనిటీల్లో జరిగిన కార్యక్రమానికి రాజ్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు సామాజిక విలువలను నేర్పించాలని సూచించారు. సింహపురి మేత్రాసనం పీఠాధిపతి బిషప్ ఎండీ ప్రకాశం మాట్లాడుతూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి మువ్వా రామలింగం మాట్లాడుతూ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా క్రిస్టియన్‌ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరందూరు సురేంద్రబాబు, జిల్లా అధ్యక్షుడు రాయపాటి హృదయకుమార్, నిర్వాహకులు ఏలీషాకుమార్, మోజెస్, దానం ప్రేమ్‌రాజ్, సుకన్య, స్వర్ణ వెంకయ్య, హనోక్, తదితరులు పాల్గొన్నారు.