గందరగోళంగా రేషనలైజేషన్
– ఉత్వర్వులను పాటించలేదన్న ఉపాధ్యాయ సంఘాలు
– మునిసిపల్ ఆర్‌డీతో మూడు గంటల చర్చలు
– ఆర్‌డీ హామీతో శాంతించిన నాయకులు
అనంతపురం న్యూసిటీ : జిల్లాలోని ఆరు మునిసిపాలిటీలు, ఒక నగగరపాలక సంస్థ పరిధిలోని స్కూళ్లకు సంబంధించిన రేషనలైజేషన్ గందరగోళానికి దారితీసింది. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్‌హాల్‌లో రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మునిసిపల్ అధికారుల తీరును తప్పుపడుతూ ఉపాధ్యాయ సంఘాలు రేషనలైజేషన్‌ను అడ్డుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఎందుకు పాటించలేదంటూ నగరపాకల సంస్థ కార్యదర్శి జ్యోతిలక్ష్మిని నిలదీశారు. అనంతరం మునిసిపల్ ఆర్‌డీ, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి చాంబర్‌కు వెళ్లారు. రేషన లైజేషన్ విధానంలో అధికారులు తీరు వివాదాలకు దారితీస్తోందంటూ ఆర్‌డీకి వివరించారు. ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించకుండా ఏవిధంగా సర్దుబాటు చేశారని, వెంటనే ఆ ఆంగ్ల మీడియంను ప్రైమరీ స్కూళ్లలో ప్రవేశపెట్టాలన్నారు.
సర్‌ప్లస్‌గా గుర్తించిన ఉపాధ్యాయ పోస్టులను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో సర్‌ప్లస్‌గా ఉన్న సబ్జెక్ట్ ఉపాధ్యాయులను ప్రాథమిక పాఠశాలలకు కేటాయించాలన్నారు. మథర్‌థెరిస్సా ప్రైమరీ స్కూల్‌లో 5 మంది ఉపాధ్యాయులంటే వారిలో ముగ్గుర్ని మిగులు ఉపాధ్యాయులుగా చూపారని, మిగితా ఇద్దరినీ రేషనలైజేషన్‌లో పరిగణించలేదన్నారు. ఆ ఇద్దరి ఆసక్తిని అడిగి సర్దుబాటు చేయాలన్నారు. ప్రధానంగా సీనియారిటీను పరిగణ లోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
నాగసముద్రం వెంగోబరావు పాఠశాలలో ముగ్గురు ఎస్‌జీటీ, ఇక ఉర్దూ సబ్జెక్ట్ టీచర్ ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులను ఏవిధంగా ఇతర స్కూళ్లకు కేటాయిస్తారన్నారు. ఒక్క ఉపాధ్యాయుడు ఏవిధంగా పాఠశాలను రన్ చేస్తారో చెప్పాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఆర్‌డీ పీవీవీఎస్ మూర్తి డీఎంఏ అధికారులతో మాట్లాడారు. చివరకు ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్న డిమాండ్లు సరైనవని నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎంటీఎఫ్ రామానాయక్, ఏపీటీఎఫ్(1938) కులశేఖర్ రెడ్డి, ఏపీటీఎఫ్ నరసింహులు, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఫణిభూషణ్, నాయుడు, ఆర్‌జేయూపీ రామాంజినేయులు, ఆర్‌యూపీపీ తులసిరెడ్డి, యూటీఎఫ్ జిలాన్, తదితరులున్నారు.
రేషనలైజేషన్ వివరాలిలా.. రీజియన్‌లోని ఆరు మునిసిపాలిటీల రేషనలైజేషన్‌ను మునిసిపల్ ఆర్‌డీ, కమిషనర్ పీవీవీఎస్ మూర్తి ప్రకటించారు. కదిరి మునిసిపాలిటీలో 23 ఎస్‌జీటీలను సర్‌ప్లస్‌లో చూయించి 9 మందిని ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. అదే మునిసిపాలిటీలో 15 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్‌ప్లస్‌లో చూపి, 15 మందిని వేరే స్కూళ్లకు కేటాయించారు. రాయదుర్గం మునిసిపాలిటీలో ఎస్‌జీటీలు 11 మంది సర్‌ప్లస్‌గా చూపి, 9 మందికి స్థానాలు కేటాయించారు. స్కూల్ అసిస్టెంట్లలో 6 మందిని సర్‌ప్లస్‌గా చూయించి ఇద్దరికి స్థానాలు కేటాయించారు.
గుంతకల్లులో ఎస్‌జీటీలు 46 మంది సర్‌ప్లస్‌గా 33 మందిని ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. ఎస్‌ఏలో 35 మంది సర్‌ప్లస్, 24 మందికి ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. హిందూపురంలో ఎస్‌జీటీలు 43 మందిని సర్‌ప్లస్ కాగా నలుగురిని ఇతర స్కూళ్లకు కేటాయించారు. 35 మంది ఎస్‌ఏలను సర్‌ప్లస్‌గా చూయించి 14 మందికి స్థానాలు కేటాయించారు. తాడిపత్రి 19 మంది ఎస్‌జీటీలను సర్‌ప్లస్‌గా చూయించి 16 మంది స్థానాలు కేటాయించారు. 14 మంది ఎస్‌ఏలను సర్‌ప్లస్‌గా చూయించి 7 మందిని ఇతర స్కూళ్లకు సర్దుబాటు చేశారు. ధర్మవరం ముగ్గురు ఎస్‌జీటీలను సర్‌ప్లస్‌గా చూయించి ఇద్దరికి స్థానాలు కేటాయించారు. 11 మంది ఎస్‌ఏలుగా చూయించి 11 మందికి స్థానాలు కేటాయించారు.