
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం
శంషాబాద్ః శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసరంగా దించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం 7.20 గంటలకు ఎఐ 559 విమానం ఢిల్లీ వెళ్లడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ తీసుకుంది. పదినిమిషాల తర్వాత విమానంలోని ఇంజన్‌లో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే ఏటీసీ అధికారులను సంప్రదించి అనుమతి తీసుకున్నాడు. 7.40 గంటలకు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా దించారు. ఎయిర్ ఇండియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రయాణికులకు 11 గంటలకు ఇక్కడి నుంచి మరో విమానంలో ఢిల్లీకి పంపినట్లు ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి.