మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోరం..!
కోడలు, ముగ్గురు మనవళ్లు అగ్నికి ఆహుతి
తెల్లవారుజామున గ్యాస్ లీకేజీతో ప్రమాదం!
మూడేళ్లుగా కుటుంబ తగాదాలు..
మరో వివాహం చేసుకున్న రాజయ్య కొడుకు అనిల్
2014లో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కోడలు
అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారంటూ కేసు
సారిక మృతిపై అనేక అనుమానాలు..
వంటింట్లో ఉండాల్సిన సిలిండర్లు బెడ్‌రూంలోకి ఎలా వచ్చాయి?
ఎవరూ ఊహించని పరిణామం.. వరంగల్ ఉప ఎన్నికల ముంగిట పెద్ద షాక్.. అందరినీ నిశ్చేష్టులను చేసే దిగ్భ్రాంతికర ఘటన.. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు! బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కొడుకులు అభినవ్, శ్రీయాన్, అయాన్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో విచారణ బృందం ఏర్పాటు చేశారు. రాజయ్య, ఆయన భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల్లో విచారణ నివేదిక రానుంది. కాగా వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి రాజయ్య తప్పుకున్నారు.
సాక్షి, హన్మకొండ: రాజయ్య నివాసంలో తెల్లవారుజామున 4, 5 గంటల మధ్య అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒకే గదిలో పూర్తిగా కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. సారికతోపాటు ఇద్దరు పిల్లల మృతదేహాలు పడక గది తలుపు వద్ద నేలపై, మరో బాలుడి మృతదేహం బెడ్‌పై పడి ఉన్నాయి. ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘అగ్ని ప్రమాదం జరిగినట్లు రాజయ్య ఇంటి నుంచి ఐదు గంటల సమయంలో ఫోన్‌కాల్ వచ్చింది. మేం వచ్చి చూసేసరికి ఇంటి మొదటి అంతస్తులో కాలిపోయిన స్థితిలో నాలుగు మృతదేహాలు ఉన్నాయి. ఈ మరణాలపై శాస్త్రీయంగా విచారణ జరిపిస్తాం.’’ అని తెలిపారు. ఘటన చోటుచేసుకున్న గది వద్దకు పోలీసులు.. మీడియాతో పాటు ఇతరులెవరినీ అనుమతించలేదు. రాజయ్య ఇంటి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మూడేళ్లుగా గొడవలే..
రాజయ్య, మాధవి దంపతులకు అనిల్ ఒక్కడే సంతా నం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అనిల్‌కు నిజామాబాద్ జిల్లా అడ్లూరుకు చెందిన సారికతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ క్లాస్‌మేట్స్. కాలేజీ హాస్టల్‌లోనే ఉండేవారు. ఆ సమయంలోనే ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఎవరికీ తెలియకుండా 2002లో హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. 2003లో చదువుల నిమిత్తం అనిల్ లండన్ వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్ది రోజులకే సారిక కూడా లండన్‌కు వెళ్లింది. 2005లో తిరిగి వచ్చిన తర్వాత వీరి వివాహ విషయం తెలుసుకున్న రాజయ్య కుటుంబీకులు అందరి సమక్షంలో యాదగిరిగుట్టలో పెళ్లి చేశారు.
కొన్నాళ్లపాటు బాగానే ఉన్న వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే అనిల్.. సనా అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. దీంతో గత మూడేళ్లుగా రాజయ్య కుటుంబ సభ్యులు, సారిక మధ్య గొడవలు జరుగుతున్నాయి. రాజయ్య కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక 2013, 2014లో సారిక రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించడంతో పాటు తనకు న్యాయం చేయాలంటూ మామ ఇంటి ఎదుట ధర్నా చేసింది. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది.
సొంతింటికి రావడంతో: గొడవల కారణంగా రాజయ్య హన్మకొండ రెవెన్యూ కాలనీలోని తన సొంత ఇంటిని కోడలికి ఇచ్చి కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలో ఓ అపార్టుమెంట్‌లో కొంతకాలంగా ఉంటున్నారు. రాజయ్య భార్య మాధవి హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ రాజయ్యతోపాటే ఉంటున్నారు. భర్త అనిల్ సారిక ఇంటికి రావడం మానేశాడు. కనీసం ఇంటి ఖర్చులకు సైతం డబ్బులు ఇచ్చేవారు కాదని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సమయంలో అనిల్, సారికకు మధ్య గొడవ జరిగిందని తెలిసింది.
వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ రావడంతో మూడ్రోజుల క్రితమే రాజయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయంలో అపార్టుమెంట్ కంటే సొంత ఇళ్లు బాగుంటుందని భావించిన ఆయన... ఇటీవలే రెవెన్యూ కాలనీలోని తన సొంతింటికి మారా రు. కింది పోర్షన్‌లో రాజయ్య దంపతులు, ఒకటో అంతస్తులో సారిక కుటుంబం ఉంటోంది. రెండో అంతస్తులోని పెంట్‌హౌస్‌కు అనిల్ వచ్చి వెళ్తుంటారని తెలిసింది. అందరూ ఒకేచోట చేరడంతో రెండ్రోజులుగా గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
బెడ్‌రూంలోకి సిలిండర్లు ఎలా వచ్చాయి?
సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనమవడంపై అనేక అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. వంటగదిలో ఉండాల్సిన రెండు గ్యాస్ సిలిండర్లు బెడ్‌రూమ్‌కు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. కుటుంబ తగాదాల కారణంగా సారిక పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించిందా? లేక ఎవరైనా వంటగది నుంచి గ్యాస్ సిలిండర్లను బెడ్‌రూమ్‌కు తీసుకొచ్చి ప్రమాదం జరిగేలా ప్లాన్ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. వంట గ్యాస్ పూర్తిగా లీక్ కావడం వల్లే పేలిన శబ్దం రాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే రెండు సిలిండర్లలోని గ్యాస్ మొత్తం బయటికి వచ్చినా ఎవరూ పసిగట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తన కూతురు సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లిదండ్రులు అంటున్నారు. రాజయ్య కుటుంబీకులే తన కూతురి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. నాలుగు మృతదేహాలు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నాయి. సాయంత్రం 6:30 గంటలకు సారిక తల్లిదండ్రులు ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున్నారు. సమయం మించిపోవడంతో పోస్టుమార్టంను వైద్యులు గురువారానికి వాయిదా వేశారు.
పోటీ నుంచి తప్పుకుంటున్నా: రాజయ్య
వరంగల్ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్లు రాజయ్య తెలిపారు. కోడలు, ముగ్గురు మనవళ్లు సజీవ దహనమైన సంగతి తెలియగానే పార్టీ శ్రేణులు పెద్దఎత్తున రాజయ్య నివాసానికి తరలివచ్చాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు, మాజీ ఎంపీలు ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా.. ‘‘ఉప ఎన్నికల్లో నేను నిలబడను.. పోటీ నుంచి విరమించుకుంటాను’’ అని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని జిల్లా నేతలు పీసీసీ అధ్యక్షుడికి వివరించడంతో మరో అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు సంప్రదింపులు జరిపారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం నార్త్‌జోన్ ఐజీ నవీన్‌చంద్
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఘటనాస్థలి నుంచి ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయి. దర్యాప్తు తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం.