తెలంగాణ టు తూర్పుగోదావరి వయా చింతలపూడి
తెలంగాణ టు తూర్పుగోదావరి వయా చింతలపూడి
Published Sun, Oct 30 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
చింతలపూడి: పొరుగు రాష్ట్రం తెలంగాణ నుంచి అక్రమంగా రేషన్ బియ్యాన్ని దిగుమతి చేసుకుని తూర్పుగోదావరి జిల్లాలోని మిల్లర్లకు పంపించేందుకు సిద్ధం చేసిన నిల్వలను శనివారం పౌరసరఫరాల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చింతలపూడి మండలంలోని రాఘవాపురం గ్రామంలో అక్రమంగా నిల్వచేసిన 128 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. గ్రామంలోని రవి, ఆంజనేయులు అనే వ్యక్తుల ఇళ్లల్లో అక్రమంగా నిల్వచేసిన ఈ బియ్యాన్ని గ్రామస్తుల సమాచారం మేరకు దాడి చేసినట్టు పౌరసరఫరాల అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో రాఘవాపురం కేంద్రంగా చాలా కాలం నుంచి పేదల కోసం పంపిణీ చేస్తున్న సబ్సిడీ బియ్యం అక్రమంగా సేకరించి, నిల్వ చేసి ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. దీనిపై చాలాకాలంగా గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాఘవాపురంలో భారీ నిల్వలను స్వాధీనం చేసుకోవడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చాకచక్యంగా తెలంగాణ నుంచి రేషన్ బియ్యాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు. తర్వాత గుట్టుచప్పుడు కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో మిల్లర్లకు పంపి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో ఇదే మాదిరిగా రాఘవాపురం నుంచి వాహనాల్లో తరలిస్తున్న బియ్యాన్ని చింతలపూడి, టి.నరసాపురం మండలాల్లో అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీనిపై తహసీల్దార్ పి.మైఖేల్‌రాజు మాట్లాడుతూ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెంచామని, పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పట్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Advertisement