బెజవాడలో ఆలయం, దర్గా కూల్చివేత
సాక్షి, విజయవాడ: పుష్కరాలకు అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రార్థనాలయాలను కూల్చివేస్తోంది. ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపక్కగా ఉన్నవాటిని అర్ధరాత్రి సమయంలో పడగొట్టేస్తోంది. తాజాగా బుధవారం అర్ధరాత్రి దుర్గగుడి గోశాల వెనుక భాగంలోని శంకరమఠాన్ని పూర్తిగా కనుమరుగుచేసింది. గాయత్రిదేవి, శివాలయంతో, ఆంజనేయస్వామి గుడులతో పాటు మరికొ న్ని ఆలయాలను తొలగించారు. మొదటి అంతస్తులో ఉన్న ప్రవచనా మందిరాన్ని పూర్తిగా తొలగించగా, కింద అంతస్తులో ఉన్న ఆలయాలను తొలగించేందుకు గడువు ఇచ్చారు.
లాగే దుర్గగుడికి వెళ్లే అర్జున వీధి మొదట్లో ఉండే హజరత్ సయ్యద్ షా ఖాద్రీ దర్గా ప్రాంగణాన్ని బుధవారం అర్ధరాత్రి కూల్చివేశారు. దర్గా మరమ్మతులు పూర్తయి కనీసం ప్రారంభోత్సవం కూడా జరుపుకోకుండానే ఇలా ధ్వంసం చేయడంపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యథావిధిగా కూల్చివేతల కొనసాగింపు..
గతంలో 30 దేవాలయాలను కూల్చివేసినందుకు నిరసనగా పీఠాధిపతులు, మఠాధిపతులు విజయవాడలో పెద్ద సభ నిర్వహించారు. ఆ సందర్భంగా ఇక నుంచి ఏ దేవాలయం, ప్రార్థనాలయం తొలగించాలన్నా ఆయా ప్రార్థనామందిరాల పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది. తొలగించిన దేవాలయాలను నిర్మించేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీని వేసింది. అయితే వీటిన్నంటినీ పక్కన పెట్టి యథావిధిగా దేవాలయాలు, దర్గాల కూల్చివేతను ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఆలయాల కూల్చివేతలు ఇక లేవంటూ ప్రకటిస్తూనే మరో వైపు ప్రభుత్వం తన వైఖరిని కొనసాగించడం సరికాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.