
దేవుడా!
– 2,500 ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం
– కోర్టు వివాదంలో 900 ఎకరాలు
– ఏటా రూ.50 లక్షల ఆదాయానికి గండి
దెందులూరు : జిల్లాలోని కొందరు అక్రమార్కులు దేవుడికి కూడా శఠగోపం పెడుతున్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాలకు చెందిన 2,500 ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యాయి. 900 ఎకరాలు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. వీటి కారణంగా ఏటా రూ.5 కోట్లకు పైగా ఆదాయానికి గండి పడుతోంది. ఆదాయం లేకపోవడంతో కొన్ని ఆలయాలకు దూప, దీప నైవేథ్యాలు కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీనిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1,724 ఆలయాలు
జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో 1,724 ఆలయాలు ఉన్నాయి. వీటిలో 1,635 ఆలయాలకు 22 వేల ఎకరాల భూమి ఉంది. సంవత్సరానికి రూ.17 కోట్ల 35 లక్షల 59 వేల ఆదాయం లభిస్తోంది. 2,500 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. మరో 900 ఎకరాలు కోర్టు వివాదంలో ఉన్నాయి. ఎకరానికి ఏడాదికి కనీసం రూ.20 వేలు ఆదాయం లెక్క వేసుకున్నా రూ.5 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుంది. దేవాదాయ శాఖ పరిధిలోని షాపులు, కల్యాణ మండపాలు, భవనాలపై సంవత్సరానికి రూ. కోటీ 80 లక్షలు ఆదాయం లభిస్తోంది. ఆక్రమణ భూములకు సంబంధించి ప్రస్తుతం 280 కోర్టు కేసులు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా దేవాదాయ శాఖకు చెందిన భూములను ఇళ్ల స్థలాల నిమిత్తం గతంలో సాంఘిక సంక్షేమ శాఖకు ఇచ్చారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇలా దేవాదాయ శాఖ భూములను ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. అయితే ఆ భూముల నిమిత్తం 2005 నుంచి ఇప్పటి వరకు రూ.కోటీ 25 లక్షలు రావాల్సి ఉంది. ఇప్పటివరకు సాంఘిక సంక్షేమ శాఖ ఆ మొత్తాన్ని దేవాదాయ శాఖకు చెల్లించలేదు. దీనిని కూడా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
60 పోస్టులు ఖాళీ
జిల్లాలోని 1,724 ఆలయాల్లో 1,100 మంది అర్చకులు పనిచేస్తున్నారు. 410 మంది ఆర్‌జేసీ, ఇన్‌స్పెక్టర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, అటెండర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీటిలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయడంపై కూడా అధికారులు దృష్టిసారించడం లేదు.