కొండంత అవమానం | temple trust board issue | Sakshi
Sakshi News home page

కొండంత అవమానం

Published Thu, Oct 13 2016 11:38 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

temple trust board issue

  • దైవ సన్నిధిలో ‘దేశం’ రాజకీయం 
  • క్యాడర్‌ అంటే కరివేపాకులా!
  • పదవులు అమ్ముకోడానికే కుటిల రాజకీయాలు
  •  
    సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ కూరలో కరివేపాకుల్లా వాడుకుని అవసరం తీరాక పక్కన పడేస్తున్నారని మహిళా కార్యకర్తలంటే మరీ చులకనగా చూస్తున్నారంటూ ఆ పార్టీలోనే లుకలుకలు బయటపడుతున్నాయి. పదవులు ఇచ్చినట్టే ఇచ్చి హఠాత్తుగా లేవు పొమ్మంటుండడంతో పార్టీ క్యాడర్‌ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. కాకినాడ∙ బాలత్రిపురసుందరి ఆలయ ట్రస్టు బోర్డు నియామకం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) సిఫార్సుతో దేవాదాయశాఖ కమిషనర్‌ వై.అనురాధ ఏర్పాటు చేసిన ట్రస్టుబోర్డు దీనికి వేదికగా మారుతోంది. ఎమ్మెల్యేకు అన్నీ తానై వ్యవహరిస్దున్న టీడీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు గ్రంధి బాబ్జీlచైర్మన్‌గా మరో తొమ్మిది మంది సభ్యులతో ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటై తరువాత పలు మార్పులకు గరైంది. దీంతో కమిటీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయనీయకుండా ఏడుగురితో మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన కర్రి పాపారావు, టీడీపీ మహిళా నేత సలాది ఉదయలక్ష్మిని పక్కనపెట్టేశారు. కొండబాబుకు కాకినాడ సిటీ నియోజకవకర్గ పార్టీ టిక్కెట్టు ప్రకటించక ముందు నుంచీ ఉదయ లక్ష్మి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ట్రస్టుబోర్డులో నియమించినట్టే నియమించి ప్రమాణ స్వీకారం చేయించకుండా ఎమ్మెల్యే, అనుచరులు ప్లేటు ఫిరాయించారని, ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించలేదని, ఉదయలక్ష్మి చేసిన తప్పేమిటని ఆమె అనుచరులు ఎమ్మెల్యేను ప్రశ్నించడానికి వెళ్లినా పట్లించుకోలేదని ఆమె వర్గం వాపోతోంది.
     
    మహిళలకు ఇదేనా మర్యాద...
    పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మహిళా నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అని తెలుగు మహిళలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఆలయ ట్రస్టుబోర్డు ప్రమాణ స్వీకారోత్సవాలు అట్టహాసంగా నిర్వహించడం పరిపాటి. అందుకు భిన్నంగా బాలాత్రిపుర సుందరి ఆలయ ట్రస్టుబోర్డు ప్రమాణస్వీకారం నాలుగు గోడల మధ్య ‘మమ’ అనిపించేయడంలో ఆంతర్యమేమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం మహిళా సభ్యురాలు ప్రమాణం చేయకుండా ట్రస్టుబోర్డు నియామకం పూర్తయినట్టు కాదని దేవాదాయ శాఖాధికారులే అంగీకరిస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని దేవాదాయశాఖ కమిషనర్‌ అనురాధ జారీ చేసిన లిఖితపూర్వక ఉత్తర్వులనే బేఖాతరుచేసి ఇద్దరు సభ్యులను పక్కన పెట్టేయడం ఎంత వరకు సమంజసమని ఉదయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     
    పదవులను అమ్ముకున్నారా..?
    పదవులను అయినకాడికి మరొకరికి అమ్మేసుకోవడంతోనే ఉదయలక్ష్మి, పాపారావు విషయంలో అలా వ్యవహరించారనే విమర్శలున్నాయి. తప్పించేందుకు సాంకేతిక కారణాలను వెతికే పనిలో ఎమ్మెల్యే అనుచరవర్గం ఉందని పార్టీ సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఉదయలక్ష్మి స్థానంలో మరొకరిని నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీవర్గాల సమాచారం. ఈ విషయం దేవాదాయశాఖా మంత్రి మాణిక్యాలరావు దృష్టికి కూడా వెళ్లింది. తనకు జరిగిన అవమానంపై ఎమ్మెల్యే సహా ఇతర నేతలపై ఉదయలక్ష్మి బాహాటంగానే దుమ్మెత్తిపోçస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం హల్‌చల్‌ చేస్తోంది. ఉదయలక్ష్మితోపాటు బీజేపీ నుంచి నియమించిన కర్రి పాపారావును కూడా ప్రమాణస్వీకారం చేయనివ్వలేదు. అలాగే జగన్నాథపురం వెంకటేశ్వరస్వామి ఆలయ ట్రస్టు బోర్డులో బీజేపీ మజ్థూర్‌ మోర్చా విభాగానికి చెందిన కొక్కిరిగెడ్డ ప్రసాద్‌ను నియమించారు. ఇక్కడ ప్రసాద్‌ను కూడా ప్రమాణస్వీకార సమయానికి పక్కనబెట్టేశారు. బీజేపీ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్‌ ఆధ్వర్యంలో కాకినాడ దేవాదాయశాఖ డీసీ కార్యాలయం వద్ద ఈ విషయంపై ధర్నా కూడా చేశారు. జగన్నాథపురం వెంకటేశ్వర ఆలయ ట్రస్టుబోర్డు వ్యవహారంలో అయితే తెలుగు తమ్ముళ్ల ఆగడాలు భరించలేక ఈఓ శివబాబు సెలవుపెట్టేసి మరీ వెళ్లిపోవాల్సి వచ్చింది. అంటే తమ్ముళ్ల వ్యవహారాలు ఏ స్థాయికి చేరుకున్నాయో తేటతెల్లమవుతోంది.       
     
    నేను చేసిన తప్పేమిటో చెప్పండి
    నేను చేసిన తప్పు ఏమిటో చెప్పమంటున్నా. పార్టీ కోసం మొదటి నుంచీ పనిచేస్తూ వస్తున్నాను. ట్రస్టుబోర్డులో నియమించినా ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. దేవాదాయశాఖాధికారులను అడుగుతుంటే మాకేమీ తెలీదు ఎమ్మెల్యేని అడగమంటున్నారు. ఎమ్మెల్యేని అడుగుదామని వెళుతుంటే బిజీగా ఉన్నారని పంపేస్తున్నారు.        – సలాది ఉదయలక్ష్మి, తెలుగు మహిళ
     
    ఎమ్మెల్యే ఆదేశాలతో నిలుపుదల చేశాం
    కాకినాడ శాసన సభ్యుడు వనమాడి వేంకటేశ్వరరావు ఆదేశాలతో ఉదయలక్ష్మి  నియామకం నిలుపుదల చేశాం. ఆమె నియామకాన్ని శాసన సభ్యుడు అంగీకరించలేదు.
    – చింతపల్లి విజయ భాస్కరరెడ్డి, బాలాత్రిపుర సుందరీదేవి ఆలయ ఈఓ 
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement