జనగామలో రెండో రోజూ బంద్
జనగామ: వరంగల్ జిల్లా జనగామ పట్టణంలో రెండోరోజు కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనగామ జిల్లా కోసం.. జేఏసీ పిలుపు మేరకు శనివారం పట్టణంలో బంద్ జరిగింది. శుక్రవారం జరిగిన బస్సు దగ్ధం ఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఉదయం నుంచే భారీగా మోహరించారు. అడిషనల్ ఎస్పీ జాన్‌వెస్లీ, డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో పారా మిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. గత కొద్ది రోజులుగా ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఉన్న జనగామ ఆర్టీసీ చౌరస్తాలో పోలీసుల ప్రదర్శన కనిపించింది. పట్టణంలో 144 సెక్షన్ విధించారు. అరుుతే, శనివారం ఉదయం కాంగ్రెస్ మహిళా కౌన్సిలర్లు వెన్నెం శ్రీలత, వేమెళ్ల పద్మ, పన్నీరు రాధిక, మహిళా సంఘ నాయకురాలు షాహిదా మరికొంతమంది కార్యకర్తలతో ఆర్టీసీ చౌరస్తాలో రాస్తారోకో చేయడానికి రాగా.. పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మేకల కళింగరాజు, ప్రశాంత్, మరికొందరు నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిని కూడా పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా వాగ్వాదం, తోపులాట జరిగింది. వారందరినీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే బీజేపీ, జేఏసీ నాయకులు నినాదాలు చేసుకుంటూ చౌరస్తాకు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. నాయకులను పోలీసులు ఈడ్చుకుంటూ డీసీఎం వాహనంలో ఎక్కించారు. కదులుతున్న వాహనం వెనుక డోర్ ఊడిపోవడంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, జేఏసీ నాయకుడు కేవీఎల్‌ఎన్ రెడ్డితోపాటు ఇద్దరు పోలీసులు కిందపడిపోయారు. కేవీఎల్‌ఎన్ రెడ్డి తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. పోలీసులు అతడిని వెంటనే ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న జేఏసీ ప్రతినిధులు, పార్టీ నాయకులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇక్కడ ఈ ఆందోళన కొనసాగుతుండగానే కాంగ్రెస్, జేఏసీ నాయకులు బక్క శ్రీను, బనుక శివరాజ్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాత్రి 7 గంటల వరకు ఉద్రిక్తత కొనసాగింది. అరెస్టు చేసిన జేఏసీ నాయకులను రిమాండ్‌కు పంపించారు.